సాక్షి, న్యూఢిల్లీ : మెట్రో రైళ్లు, లోకల్ రైళ్లు ప్రారంభమైనా రానున్న నెల రోజుల పాటు వాటిలో ప్రయాణం చేయబోమని లోకల్‌సర్కిల్స్ నిర్వహించిన సర్వేలో 67 శాతం మంది తేల్చిచెప్పారు. ఇక వచ్చే నెల రోజుల్లో జిమ్నాజియం, స్విమ్మింగ్‌పూల్‌కు వెళతామని కేవలం 15 శాతం మంది పౌరులే పేర్కొన్నారు.రాబోయే మూడు నెలల పాటు విహార యాత్రలకు, హోటళ్లలో గడిపేందుకు ఎలాంటి ప్రణాళికలు రూపొందించుకోలేదని 93 శాతం మంది పేర్కొన్నారు. జూన్ 30తో అన్‌లాక్ 1.0 ముగుస్తున్నా పలు రంగాలకు భారీ సడలింపులు ప్రకటించినా కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు.
అన్‌లాక్ 2.0 దశలో ప్రజలు మెట్రో, లోకల్ ట్రైన్లను ఎంతవరకూ ఉపయోగించుకుంటారు...జిమ్‌లు, స్విమ్మింగ్‌పూల్‌లకు వెళ్లడం, విహార యాత్రలకు ప్లాన్ చేయడంపై లోకల్‌సర్కిల్స్ సర్వేలో ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. దేశవ్యాప్తంగా 241 జిల్లాల్లో పౌరులను ప్రశ్నించడం ద్వారా 24,000 సమాధానాలను రాబట్టింది. కాగా వీలైనంత త్వరలో మెట్రో సర్వీసులను పునరుద్ధరిస్తామని ఢిల్లీ మెట్రో రైల్వే కార్పొరేషన్ ఇటీవల వెల్లడించింది. జూన్ 15న ముంబైలో లోకల్ రైళ్ల రాకపోకలు ప్రారంభమైనా ప్రయాణీకుల నుంచి స్పందన పరిమితంగా ఉండటం గమనార్హం.
ఇక వచ్చే నెలరోజుల్లో మెట్రో రైళ్లు, లోకల్ రైళ్లు పునఃప్రారంభమైతే వాటిలో ప్రయాణిస్తామని 25 శాతం మంది పేర్కొనగా, కరోనా వ్యాప్తి చెందుతున్న ఈ తరుణంలో మెట్రో ప్రయాణం సురక్షితం కాదని 67 శాతం మంది పౌరులు వెల్లడించారు. పెట్రో ధరలు ఇటీవల భారీగా పెరిగి తమ జేబులకు చిల్లు పెడుతున్నా కరోనా భయంతో వాహనదారులు ప్రజా రవాణావైపు కన్నెత్తి చూడటం లేదు. ఇక రానున్న నెల రోజుల్లో జిమ్నాజియంలు, స్విమ్మింగ్‌పూల్స్ తెరుచుకున్నా వాటిని సందర్శించబోమని 84 శాతం మంది వెల్లడించగా, జిమ్‌లు, స్విమ్మింగ్‌పూల్స్‌కు వెళతామని కేవలం 15 శాతం మంది పౌరులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment