సెల్ఫీ సరదా.. పక్షవాతం అంచుకు తెచ్చింది..!
పనాజీ: సెల్ఫీ.. ఈ పదం స్మార్ట్ ఫోన్ యూజర్లను వెర్రివాళ్లను చేస్తోంది. తమకు నచ్చిన ప్రాంతంలో, కావలసిన వ్యక్తులతో విభిన్న ప్రదేశాల్లో సెల్ఫీలు తీసుకోవాలని తాపత్రయ పడుతుంటారు. సెల్ఫీ మోజు మోతాదు శృతిమించితే ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నా ప్రయోజనం కనిపించడం లేదు. అందుకు గోవాలో ఇటీవల జరిగిన ఓ సంఘటనను ఉదాహరణగా చెప్పవచ్చు. ఇద్దరు యువతులు ఏకంగా జీవితాంతం పక్షవాతానికి గురయ్యే ప్రమాదానికి గురయ్యారు. గత నెల 22న పనాజీలోని అంజునా గ్రామంలో ఐదుగురు పర్యాటకులు వచ్చారు. సెల్ఫీలు తీసుకోవడానికి ఓ కొండ పైకి ఎక్కారట. ఈ గ్రూపులోని ఇద్దరు మహిళలు సెల్ఫీ కోసం ప్రయత్నించగా అక్కడి నుంచి ఓ పెద్దరాయిపై పడిపోయారు.
ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ మిగతా పర్యాటకులు కూడా కిందపడ్డారట. పోలీసులు ఈ ఘటనపై తాజాగా వివరాలు తెలిపారు. ఇన్ స్పెక్టర్ పరేష్ నాయక్ వివరాల ప్రకారం... వారు ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్ పొందుతున్నారు. ఇద్దరు మహిళలు పక్షవాతానికి గురయ్యే అవకాశాలు కనిపిస్తున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. ముగ్గురు మాత్రం స్వల్పగాయాలకు చికిత్స చేయించుకుని అనంతరం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారట. ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయవద్దని బాధితుల కుటుంబసభ్యులు పోలీసులను కోరినట్లు వారు తెలిపారు. బాధితుల వివరాలు వెల్లడించేందుకు నిరాకరించిన పరేష్ నాయక్, యువతుల వయసు 25పైనే ఉంటుందని మాత్రమే చెప్పారు. బాధితులపై కేసు నమోదు చేయనప్పటికీ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ ముందు వారి వాంగ్మూలాన్ని ఇవ్వాలని ఆ అమ్మాయిల కుటుంబాలకు చెప్పినట్లు వివరించారు.