
సాక్షి, హైదరాబాద్: గోవా వెళ్లాలనుకునే రైల్వే పర్యాటకులకు శుభవార్త. త్వరలో మహబూబ్‌నగర్–మునీరాబాద్ ట్రాక్ పనులు పూర్తి కానున్నాయి. దీంతో హైదరాబాద్–గోవా మధ్య దూరం 102 కి.మీ. తగ్గనుంది. దాదాపు 2 గంటల ప్రయాణ సమయం తగ్గుతుంది. ప్రస్తుతం పనులు వేగంగా సాగుతున్నాయి. 247 కి.మీ.ల ట్రాక్ పనులను 2019–20 నాటికి పూర్తి చేయాలని దక్షిణమధ్య రైల్వే పట్టుదలగా ఉంది. 1997–98లో రూ.1,723 కోట్ల అంచనా వ్యయంతో ఈ ట్రాక్ పనులు చేపట్టారు. 66 కి.మీ.ల ట్రాక్ తెలంగాణ పరిధిలో ఉంది. మిగిలిన ప్రాంతం నైరుతి రైల్వే పరిధిలోని కర్ణాటకలో ఉంది. దేవరకద్ర–కృష్ణ మధ్య 66 కి.మీ. దూరం పనులను రూ.372 కోట్ల అంచనాతో మొదలుపెట్టారు. దేవరకద్ర–జక్లేర్ (29 కి.మీ.) పనులు పూర్తయ్యాయి. జక్లేర్–కృష్ణ (37 కి.మీ.) పనులు కూడా వేగంగా సాగుతున్నాయి. తెలంగాణ పరిధిలో రైలు మార్గం కోసం 866 ఎకరాల భూమి అవసరం కాగా.. 734 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వం సేకరించి రైల్వేకు స్వాధీనం చేసింది.
ప్రాజెక్టు ముఖ్యాంశాలు...
- 247 కి.మీ. మహబూబ్‌నగర్–మునీరాబాద్ ట్రాక్ పనుల అంచనా వ్యయం: రూ.1,723 కోట్లు
- దేవరకద్ర–కృష్ణ దూరం 66 కి.మీ... పనుల అంచనా వ్యయం రూ.372 కోట్లు
- 2018–19 బడ్జెట్‌లో కేటాయించిన నిధులు: రూ.175 కోట్లు
- ఈ పనులను ప్రధాని పర్యవేక్షక బృందం (పీఎంజీ) ద్వారా పర్యవేక్షించారు.
- ప్రాజెక్టులో భాగంగా నిర్మాణాలు: 3 పెద్ద వంతెనలు, 82 చిన్న వంతెనలు, 05 ఆర్వోబీలు, 27 ఆర్‌యూబీలు
- మహబూబ్‌నగర్–మునీరాబాద్ ట్రాక్ పనులు పూర్తయితే హైదరాబాద్– గోవా మధ్య తగ్గనున్న దూరం: 102 కి.మీ.
Comments
Please login to add a commentAdd a comment