శ్రీనగర్: ఆధ్యాత్మిక గురువు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ స్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్‌కు కశ్మీర్‌లో ఊహించని పరిస్థితి ఎదురైంది. కశ్మీర్‌లో ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తుండగా.. యువకులు ఒక్కసారిగా 'ఆజాదీ' నినాదాలు ఇచ్చారు. దీంతో రవిశంకర్ ఉలిక్కిపడ్డారు. అసలు రవిశంకర్ అంటే ఎవరో తమకు తెలియదని, చదువుకున్న యువకులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్తే.. తాము ఇక్కడికి వచ్చామని స్థానిక యువకులు తెలిపారు. ఇక్కడికి వచ్చాక 'మెసేజ్ ఆఫ్ లవ్' గురించి ప్రసంగాలు చేస్తున్నారని, వాటికి తాము వ్యతిరేకమని సభ మధ్యలోనే వారు వెళ్లిపొయారు.
మరికొందరు యువకులు క్రికెట్ కిట్లు, డబ్బులు ఇస్తామంటే చాలా దూరం నుంచి వచ్చామని, రవిశంకర్ మమ్మల్ని మోసం చేశారని బారాముల్లా నుంచి వచ్చిన యువకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మధ్య కశ్మీర్ నుంచి వచ్చిన మరికొంతమంది ఇస్లాం మతగురువులు వస్తున్నారని చెప్పి, ఈ ఆధ్యాత్మిక గురువును తీసుకొచ్చారని నిర్వాహకులపై మండిపడ్డారు. దీనిపై స్పందించిన రవిశంకర్ కశ్మీర్ ప్రజల్లో ప్రేమ, శాంతిని నెలకొల్పాలని ఇక్కడ సభను ఏర్పాటు చేశానని తెలిపారు. ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరమని, మరో రెండు రోజులపాటు ఇక్కడే ఉండి కశ్మీర్ ప్రజల్లో ప్రేమ, ఆప్యాయత, సంతోషంతో కూడిన సుహృద్భావ వాతావరణం కోసం ప్రయత్నిస్తానని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment