
టీవీ విశ్లేషకుడిపై దాడి
బీఫ్ బ్యాన్ను సమర్ధించిన టీవీ విశ్లేషకుడి పై దాడి చేసిన కొట్టిన వైనం కేరళలో చోటు చేసుకుంది.
తిరువనంతపురం: గోమాంసం నిషేధం సెగలు దేశంలో ఏదో ఒక మూల రగులుతూనే ఉన్నాయి. కేరళ విద్యాసంస్థల్లో వివాదం ముదురుతోంది. బీఫ్ బ్యాన్ను సమర్ధించిన ఓ టీవీ విశ్లేషకుడిపై దాడిచేసి కొట్టిన వైనం కేరళలో చోటుచేసుకుంది. అలెప్పూ సమీపంలోని ఒక కాలేజీ ఫంక్షన్కు వెళ్లి వస్తున్న రాహుల్ ఈశ్వర్ పై కొంతమంది విద్యార్థులు చేయి చేసుకున్నారు. కాయంకులం ఎంఎస్ఎం కాలేజీ ఆవరణలో రాహుల్పై దాడిచేసిన విద్యార్థులు అతని కారును ధ్వంసం చేశారు. శబరిమలై మతగురువు మనవడైన రాహుల్ పలు టీవీ చానళ్లలో విమర్శకుడిగా తన వాదనలు వినిపిస్తుంటారు. ఈ నేపథ్యంలో వివాదాస్పద అంశం బీఫ్ బ్యాన్ ను సమర్ధిస్తూ జాతీయ మీడియా చర్చలో వ్యాఖ్యానించారు. ఈ ఘటనలో 15 మంది విద్యార్థులపై పోలీసులు కేసు నమోదు చేశారు
కాగా రెండు రోజులు ఇదే అంశంపై రాష్ట్రంలోని మరో కాలేజీలో కూడా వివాదం చెలరేగింది. క్యాంపస్లో గోమాంసంతో విందు చేసుకున్న విద్యార్థులపై కాలేజీ యాజమాన్యం క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. యాజమాన్యం చర్యను ఖండించిన దీపా నిశాంత్ అనే మహిళా టీచర్పైనా చర్యలు తీసుకుంది. దీనిని కాంగ్రెస్ ఎంపీ వేణుగోపాల్ ఖండించారు. అలాగే కొట్టాయంలోని మరో కాలేజీలో దాద్రి ఘటనకు నిరసనగా బీఫ్ ఫెస్ట్ నిర్వహించిన వామపక్ష విద్యార్థులు కొందరిపై సస్పెన్షన్ వేటు పడింది.