
ఆరుగురు ఉగ్రవాదుల హతం
- కశ్మీర్‌లో 2 ఎన్‌కౌంటర్లు
- నలుగురిని మట్టుబెట్టి సైనికుడి వీరమరణం
శ్రీనగర్: కశ్మీర్‌లో రెండ్రోజుల వ్యవధిలో జరిగిన రెండు ఎన్‌కౌంటర్లలో ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. హంగ్ పంద్ దాదా అనే జవాను మృతి చెందాడు. కుప్వారా జిల్లా నౌగమ్ సెక్టార్‌లోని ఎల్‌ఓసీ ప్రాంతంలో నలుగురు ఉగ్ర వాదులు పాక్ ఆక్రమిత కశ్మీర్‌నుంచి గురువారం భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించారు. ఉగ్రవాదుల కదలికల్ని గుర్తించిన భద్రతా దళాలు వారిపై కాల్పులు జరపగా, నలుగురు ఉగ్రవాదులు మరణించారు. కాగా.. బారాముల్లా జిల్లా తంగ్‌మార్గ్‌లో జరిపిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులు మరణిం చారు.
వీర మరణం: హవిల్దార్ హంగ్‌పంద్ దాదా (36) గతేడాది నుంచి 13 వేల అడుగుల ఎత్తులోనున్న శామ్‌శబరి రేంజ్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు. గురువారం ఉగ్రవాదుల కదలికలను పసిగట్టిన దాదా బృందం వెంటనే రంగంలోకి దిగి ముగ్గురిని అక్కడే చంపేసింది. మరొక ఉగ్రవాదిని దాదా కాల్చిచంపాడు. తన సమయస్ఫూర్తితో తోటి సైనికులను కాపాడాడు. దాదా తీవ్రంగా రక్తం కారుతున్నా, వెనక్కి తగ్గకుండా ఎంతో ధైర్యసాహసాలతో పోరాడి దేశం కోసం ప్రాణాలు అర్పించాడని అధికారులు వెల్లడించారు. దాదా అరుణాచల్‌ప్రదేశ్ వాసి.