శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో పాకిస్థాన్‌కు చెందిన జైషే మహ్మద్ (జేఈఎం) ఉగ్రవాదులిద్దర్ని భారత భద్రతా దళాలు అరెస్టు చేశాయి. వారి వద్ద నుంచి పెద్ద ఎత్తున మందుగుండు సామాగ్రి, ఏకే 47తో సహా ఓ పిస్టలను స్వాధీనం చేసుకున్నారు. కాగా పాకిస్తాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఆర్‌ఎస్ పుర సెక్టార్లో శుక్రవారం రాత్రి పాక్ దళాలు కాల్పులు జరిపాయి.
అప్రమత్తమైన భారత భద్రతా దళాలు కాల్పులను తిప్పికొట్టాయి. ఈ సందర్భంగా జమ్ము కమిషనర్ సిమ్రాన్ దీప్ సింగ్ మాట్లాడుతూ సరిహద్దు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. మరో 18 గంటల వరకూ స్థానికులు ఇళ్లలో నుంచి బయటకు రాకపోవడమే మంచిదని ఆయన సూచించారు. అలాగే రాజౌరీలోని మంజకొటె సెక్టార్లో వద్ద కూడా పాక్ కాల్పులకు పాల్పడింది. భారత్ సర్జికల్ దాడులు చేసిన తర్వాత పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దు, వాస్తవాధీన రేఖ వెంబడి కాల్పుల ఉల్లంఘనకు పాల్పడటం పరిపాటిగా మారింది.