
సాక్షి, న్యూఢిల్లీ : రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ కురువృద్ధుడు, దిగ్గజ నేత ఎల్‌కే అద్వానీని పార్టీ పక్కనపెట్టిందనే ప్రచారం సరైంది కాదని కేంద్ర మంత్రి ఉమాభారతి అన్నారు. ‘ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని భావిస్తున్నట్టు అద్వానీజీ గతంలోనే చెప్పార’ ని ఆమె వ్యాఖ్యానించారు. బీజేపీ గురువారం విడుదల చేసిన లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాలో అద్వానీ పేరులేకపోవడం గమనార్హం.
మరోవైపు అద్వానీ ప్రాతినిధ్యం వహిస్తున్న గుజరాత్‌లోని గాంధీనగర్ లోక్‌సభ స్ధానానికి అమిత్ షాను బీజేపీ బరిలోకి దింపింది. తొలి జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, రాజ్‌నాథ్ సింగ్ సహా పలువురు సీనియర్ నేతలకు చోటుదక్కింది. అద్వానీ స్ధానం అమిత్ షాకు కేటాయించడంతో దిగ్గజ నేతను పార్టీ దూరం పెడుతున్నదనే విమర్శలు జోరందుకున్నాయి. సోషల్ మీడియాలోనే ఇదే అంశంపై ఆసక్తికర చర్చ సాగింది.