
దారుణంగా పడిపోయిన వృద్ధిరేటు.. నన్నెలా ఛేదిస్తారో చూస్తానంటూ సైంధవుడిలా సవాలు విసురుతోంది!!. ఎన్ని చర్యలు తీసుకున్నా దారికి రాని మందగమనం.. అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మ లాంటి కురువీరులను గుర్తుకుతెస్తోంది. ఎంత ప్రయత్నించినా కట్టడికాని ద్రవ్యలోటు... ద్రోణుడు, కర్ణుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడి వంటి చక్రవ్యూహ సూత్రధారుల్ని స్ఫురణకు తెస్తోంది. వెరసి.. అభేద్యమైన పద్మవ్యూహం లాంటి బంధంలో భారత ఆర్థిక వ్యవస్థ ఇరుక్కు పోయింది. 5 శాతానికి పతనమైన వృద్ధిరేటు.. 7శాతానికి ఎగసిన ద్రవ్యోల్బణం.. మందగించిన అమ్మకాలు.. ఊడిపోతున్న ఉద్యోగాలు.. ఎత్తిపోతున్న బ్యాంకులు.. 10 లక్షల కోట్ల మేర పేరుకున్న బకాయిలు.. దివాలా తీస్తున్న కార్పొరేట్లు.. విస్తరిస్తున్న కరోనా వైరస్... వీటిలో ఏవీ చిన్న సమస్యలు కావు. పద్మవ్యూహానికి కాపుకాసిన రథ, గజ, తురగ, పదాతి దళాల్లాంటివే. బడ్జెట్ సాక్షిగా ఈ వ్యూహాన్ని ఛేదించ బోయారు మోదీ. కానీ!! వినియోగం పెంచాలంటే పన్నులు తగ్గాలి.
అలా చేస్తే రాబడి తగ్గి లోటు పెరుగు తుంది. లోటు పెరిగితే రేటింగ్ తగ్గి అప్పులు పుట్టవు. ద్రవ్యోల్బణం పెరిగి ఆర్థికవ్యవస్థ అతలాకుతలం. మరెలా? అందుకే ఎల్‌ఐసీపై ఎనలేని నమ్మకం పెట్టుకున్నారు మోదీ. దాన్లో వాటా విక్రయించి.. లోటు పెరగకుండా ఖజానా నింపి.. ఈ బంధం నుంచి భారత్‌ను బయటకు తేవాలనుకుంటున్నారు. గతేడాది కూడా ఇలాంటి లక్ష్యాలు పెట్టుకున్నా.. సాధించలేకపోయారు. ఈ సారి అనుకున్నవి అర్జునుడిలా ఛేదిస్తే.. ఎకానమీ గాడిన పడుతుంది. అభిమన్యుడిలా విఫలమైతే మాత్రం.. మరిన్ని విపరిణామాలు చూడాల్సిందే!!.
బడ్జెట్ హైలైట్స్..
►ఆదాయపు పన్ను రేట్లు, శ్లాబుల్లో భారీ మార్పులు.
బ్యాంకులు దివాలాతీస్తే డిపాజిట్లపై బీమా కవరేజీ ఇప్పుడున్న రూ.1 లక్ష – రూ.5 లక్షల వరకూ పెంపు.
►ఆధార్ ప్రాతిపదికన పాన్ నంబరు కేటాయింపు.
►పబ్లిక్ ఇష్యూతో ఎల్‌ఐసీలో వాటా విక్రయానికి ఓకే.
►డిజిన్వెస్ట్‌మెంట్(ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటా అమ్మకం) ద్వారా 2020–21లో నిధుల సమీకరణ లక్ష్యం రూ.1.2 లక్షల కోట్లు. 2019–20లో ఈ లక్ష్యం రూ.65,000 కోట్లు మాత్రమే.
►రక్షణ రంగానికి కేటాయింపులు గతేడాది రూ.3.16 లక్షల కోట్ల నుంచి రూ.3.23 లక్షల కోట్లకు పెంపు.
►వ్యవసాయం, సంబంధిత రంగాలకు రూ.2.83 లక్షల కోట్ల నిధుల కేటాయింపు. నాబార్డ్ ద్వారా రీఫైనాన్స్ స్కీమ్‌ను మరింత విస్తృతంగా అమలు చేయాలని నిర్ణయం.
►మహిళలకు సరైన పెళ్లి వయస్సును సూచించేందుకు వీలుగా ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు ప్రతిపాదన.
►షెడ్యూల్డ్ కులాలు, ఇతర వెనుకబడిన వర్గాలకు రూ.85,000 కోట్ల కేటాయింపు. షెడ్యూల్డ్ తెగలకు కేటాయింపు రూ.53,700 కోట్లు.
►ప్రస్తుత ద్రవ్యలోటును గత అంచనా 3.3%–3.8 శాతానికి సవరణ. వచ్చే ఏడాదికి 3.5 శాతానికి పెంపు.
►ఆరోగ్య రంగానికి రూ.69,000 కోట్లు, స్వచ్ఛ భారత్‌కు రూ.12,300 కోట్ల చొప్పున నిధుల కేటాయింపు.
►త్వరలో కొత్తగా జాతీయ విద్యా విధానానికి రూపకల్పన.
Comments
Please login to add a commentAdd a comment