'క్యూ' మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు!
లక్నో: నోట్ల రద్దు నేపథ్యంలో బ్యాంకు క్యూలలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ రూ. 2 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు క్యూలలో మృతి చెందినట్లు పేర్కొన్న 13 మంది కుటుంబాలకు ఆయన శనివారం చెక్కులు ప్రధానం చేశారు. బ్యాంకు క్యూలో నిలుచున్న సమయంలో.. పురిటి నొప్పులతో బిడ్డకు జన్మనిచ్చిన ఓ మహిళకు సైతం సీఎం రూ. 2లక్షల చెక్కును ప్రధానం చేశారు.
ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఏర్పడిన సమయంలో నల్లధనం ఇండియాకు సహాయపడిందంటూ గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అఖిలేష్.. డీమానిటైజేషన్ చర్య సరైనది కాదని, దేశానికి హానికరం అని పేర్కొంటున్న విషయం తెలిసిందే. నోట్ల రద్దుపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని త్వరలో జరగబోయే ఎన్నికల్లో డీమానిటైజేషన్‌కు వ్యతిరేకంగా ప్రజలు ఓటు వేస్తారని అఖిలేష్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.