ఏటీఎంలలో డబ్బుంది.. జనమే లేరు!
శ్రీనగర్: పెద్ద నోట్ల రద్దు అనంతరం బ్యాంకులు, ఏటీఎంల వద్ద నెలకొన్న గందరగోళ పరిస్థితులు తెలిసినవే. ఏటీఎంల వద్ద డబ్బు కోసం జనం భారీ క్యూల్లో జనం పడుతున్న బాధలు అంతాఇంతా కావు. పక్కనే మనిషి చచ్చిపోయినా పట్టించుకోకుండా క్యూల్లో జనం ముందుకు సాగుతున్న పరిస్థితులనూ చూశాం.
దేశంలో దాదాపు అన్ని చోట్ల ఇదే పరిస్థితి నెలకొన్నప్పటికీ.. జమ్మూకశ్మీర్‌లో మాత్రం పరిస్థితి భిన్నంగా కనిపిస్తుంది. దేశంలో ఎక్కడ చూసినా నో క్యాష్ బోర్డులతో వెక్కిరిస్తోంటే.. కశ్మీర్‌లో మాత్రం ఏటీఎంలలో డబ్బులున్నా అటువైపు చూసే వారే లేరు. ఎక్కడో ఒక చోట గరిష్టంగా ఐదారుగురు మాత్రమే ఏటీఎం క్యూల్లో కనిపిస్తున్నారు.
నోట్ల రద్దు తరువాత ఇక్కడ మొదటి రెండు రోజులు మాత్రం ఏటీఎంల వద్ద జనం కాస్త బారులు తీరినట్లు కనిపించారు. ఆ తరువాత ఏటీఎంలు, బ్యాంకుల వద్ద సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి అని సోపోర్‌లోని జమ్మూ అండ్ కశ్మీర్ బ్యాంకు బ్రాంచ్ మేనేజర్ ఇజాజ్ అహ్మద్ వెల్లడించారు. కశ్మీర్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మూలంగా ప్రజల ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోవడమే దీనికి కారణమని ఆయన తెలిపారు.
జులైలో హిజ్బుల్ ఉగ్రవాది బుర్హాన్ వాని ఎన్‌కౌంటర్ అనంతరం అక్కడ ఎక్కువగా కర్ఫ్యూ నీడలోనే గడిచింది. ఈ సమయంలో జనం ఎక్కువగా ఇళ్లకే పరిమితమైపోయారు. వారు బ్యాంకుల్లో డబ్బు దాచుకోవడం మాట అటుంచితే.. సేవ్ చేసుకున్న అంతో ఇంతో డబ్బు కూడా ఖర్చయిపోయింది. అందువల్లే ఏటీఎంల వద్ద దేశంలోని మిగతా ప్రాంతాల్లా కాకుండా ఇక్కడ క్యూలలో జనం తక్కువగా ఉన్నారని ఈ పరిస్థితులను విశ్లేషిస్తూ కశ్మీర్ యూనివర్సిటీ బిజినెస్ అండ్ ఫైనాన్సియల్ డిపార్ట్‌మెంట్ ప్రొఫెసర్ సంగ్మీ వెల్లడించారు. కర్ఫ్యూ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు ముందు జాగ్రత్తగా నిత్యావసరాలను నిల్వ ఉంచుకోవడం కూడా వారికి ఏటీఎంలతో పనిలేకుండా చేస్తుందని ఆయన తెలిపారు.