
ఇక రాష్ట్ర వ్యవహరాలపై దృష్టి సారించనున్న కేంద్రం!
పార్లమెంట్ ఉభయ సభలలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు ఆమోదం పొందటంతో కేంద్ర ప్రభుత్వం శుక్రవారం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహరాలపై దృష్టి సారించనుంది.
పార్లమెంట్ ఉభయ సభలలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు ఆమోదం పొందటంతో ఇక కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యవహరాలపై దృష్టి సారించనుంది. రాష్ట్ర విభజనపై కేంద్రం అనుసరించిన వైఖరిని నిరసిస్తూ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. ఇటు లోక్సభ, అటు ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఆ తరుణంలో సీఎంగా కొత్త వ్యక్తికి సీఎం బాధ్యతలు అప్పగించాలా లేక రాష్ట్రపతి పాలన విధించాలా అని కేంద్రం తర్జనభర్జన పడుతోంది.
అంతేకాకుండా నిన్నే రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందటంతో ఆంధ్రప్రదేశ్ వ్యవహరాలపై చర్చించేందుకు కేంద్ర కేబినెట్కు సమయం చిక్కింది. దాంతో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సీఎం రాజీనామా, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై గవర్నర్ నరిసింహన్ ఇప్పటికే కేంద్రానికి నివేదిక పంపారు.
ఆ నివేదిక అందినట్లు ఇప్పటికే కేంద్ర మంత్రి కమల్నాథ్ గురువారం వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే ఆంధ్రప్రదేశ్ విభజన నేపథ్యంలో ఎన్నికల ముందే అవశేష ఆంధ్రప్రదేశ్కు సీఎంగా చిరంజీవిని నియమిస్తారని ప్రచారం జరుగుతుంది. అలాగే తెలంగాణ సీఎం పదవికి గీతరెడ్డి, పొన్నాల లక్ష్మయ్య తన లాబీయింగ్ ముమ్మరం చేసినట్లు సమాచారం.