
'తొలిసారిగా రాజ్యసభకు ఎన్నికవడం ఆనందంగా ఉంది'
న్యూఢిల్లీ : తొలిసారిగా రాజ్యసభకు ఎన్నికవడం ఆనందంగా ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి తెలిపారు. మంగళవారం న్యూఢిల్లీలో రాజ్యసభ సభ్యునిగా ఆయన ప్రమాణం చేశారు. అనంతరం విజయసాయిరెడ్డి మాట్లాడుతూ... వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున నేనే మొదటివాడిగా రాజ్యసభలో అడుగుపెట్టడం సంతోషంగా ఉందన్నారు.
నాకు ఈ అవకాశం ఇచ్చిన పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్రెడ్డితోపాటు ఎంపీలు, ఎమ్మెల్యేలకు విజయసాయిరెడ్డి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. రాజ్యసభ సభ్యత్వాన్ని అలంకారంగా భావించడం లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని విజయసాయిరెడ్డి వెల్లడించారు.