
బీఫ్ తరలిస్తున్న వాహనానికి నిప్పు
ముంబై : మహారాష్ట్రలో బీఫ్ నిషేధం వివాదం రోజురోజుకు ఉధృత రూపం దాలుస్తోంది. బీఫ్ ను తరలిస్తున్న వ్యాన్ కు నిప్పు పెట్టిన సంఘటన రాష్ట్రంలో కలకలం రేపింది. ఈ ఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. అహ్మద్‌నగర్ నుంచి ఔరంగాబాద్‌కు బీఫ్‌ను తరలిస్తుండగా సావ్‌ఖేడా గ్రామం వద్ద కొంత మంది వ్యాన్‌ను ఆపి డ్రైవర్‌తో గొడవకు దిగారు. ఆ తర్వాత వాహనానికి నిప్పుపెట్టారు.
ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు వ్యాన్‌లో బీఫ్ తరలిస్తున్న విషయాన్ని నిర్ధారించారు. సుమారు వంద కేజీల మాంసాన్ని తరలిస్తున్నట్టుగా ఔరంగాబాద్ ఎస్పీ నవీన్ చంద్ర రెడ్డి తెలిపారు. అయితే వ్యాన్ పాక్షికంగా తగులబడిన ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు ఎలాంటి గాయాలు కాలేదన్నారు. ఇటూ బీఫ్ రవాణాపై నిషేధం ఉన్న నేపథ్యంలో అక్రమంగా బీఫ్‌ను తరలిస్తున్న డ్రైవర్‌పై, నిప్పు పెట్టిన ఆందోళనకారులపై కేసులు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.