
'ఐదేళ్ల కోసం మాకు అధికారాన్ని ఇచ్చారు'
హైదరాబాద్ : గడిచిన ఏడాది పాలన సంతృప్తికరంగా సాగిందని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. బీజేపీ ఏడాది పాలనపై ఆయన శుక్రవారమిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రజల ఆశయాల మేరకు పని చేశామని తాము భావిస్తున్నామన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో దేశం కొత్త పుంతలు తొక్కుతుందని వెంకయ్య ఈ సందర్భంగా తెలియజేశారు.
ప్రజలు తమకు ఐదేళ్ల కోసం అధికారం ఇచ్చారని, గత పదేళ్ల అవలక్షణాలను తొలగించటమే ప్రధాన లక్ష్యమన్నారు. మోదీ వేసే ప్రతి అడుగు పేదరిక నిర్మూలన వైపేనని వెంకయ్య చెప్పారు. పేదల జీవితాల్లో వెలుగు నింపాలన్నదే తమ లక్ష్యమన్నారు. 2022 నాటికి అందరికీ ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్నదే తమ లక్ష్యంగా చెప్పారు.