థూ.. అని ఉమ్మేశారు!
చెన్నై: అధికారం ఇచ్చినా సరే, లేకుంటే పీఎం పదవైనా ఓకే అంటూ వ్యాఖ్యలు చేసిన డీఎండీకే అధ్యక్షుడు, నటుడు విజయకాంత్ మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా మీడియాపై దురుసుగా ప్రవర్తించడమే కాకుండా అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదంలో నిలిచారు. డీఎండీకే పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన విజయకాంత్ను మీడియా పలకరించింది. అంతవరకూ బాగానే ఉంది. ఆ తర్వాతే అయ్యగారు తన ప్రతాపం చూపించారు.
2016 అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ జయలలిత అధికారంలోకి వస్తారని మీరు భావిస్తున్నారా అని విజయకాంత్ను ఓ విలేకరి ప్రశ్నించగా ...అందుకు ఆయన సావధానంగానే జవాబిచ్చారు. అంతేకాకుండా అన్నాడీఎంకే మళ్లీ అధికారాన్ని చేపట్టడం సాధ్యం కాదని ఆయన తేల్చిపారేశారు. ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ విజయకాంత్ అకస్మాత్తుగా విలేకరులపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు.
ఈ ప్రశ్నను జయలలితను అడిగే దమ్ము మీకుందా అంటూ మీడియాపై విరుచుకుపడ్డారు. అనంతరం ఆగ్రహంతో ఊగిపోతూ.. మీకు భయం.. మీరు జర్నలిస్టులా అంటూ థూ.. అని వారిపై ఉమ్మి వేశారు. ఈ ఘటనను పలు జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా ఖండించాయి. విజయకాంత్ వైఖరిని జర్నలిస్టు సంఘాలు తప్పుబట్టాయి. ఆయన బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.