కోల్‌కతా/న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల వేళ మరోసారి హింస చెలరేగింది. రాజధాని కోల్‌కతాలో బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) కార్యకర్తల మధ్య తీవ్ర మంగళవారం ఘర్షణలు చోటుచేసుకున్నాయి. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ర్యాలీలో పాల్గొనగా, ఘర్షణలు జరగడంతో ర్యాలీని మధ్యలోనే నిలిపివేయాల్సి వచ్చింది. అయితే ఈ గొడవల్లో ఆయనకు ఏమీ కాలేదు. అమిత్ షా ర్యాలీపై టీఎంసీ కార్యకర్తలు రాళ్లు రువ్వడంతో ఈ గొడవ ప్రారంభమైందని అధికారులు చెప్పారు. కోపోద్రిక్తులైన బీజేపీ మద్దతుదారులు టీఎంసీ కార్యకర్తలతో గొడవకు దిగి ఒకరినొకరు కొట్టుకున్నారు. ఎప్‌ప్లనేడ్ అనే ప్రాంతంనుంచి స్వామి వివేకానంద పూర్వీకుల ఇంటి వరకు, దాదాపు 4 కిలోమీటర్ల వరకు అమిత్ షా ర్యాలీ నిర్వహించాల్సి ఉండగా, ఆయన వాహనం విద్యాసాగర్ కళాశాల వద్దకు చేరుకోగానే అక్కడి హాస్టల్ లోపలి నుంచి బీజేపీ వాళ్లపైకి టీఎంసీ కార్యకర్తలు రాళ్లు విసిరారు. అనంతరం ప్రతిదాడికి దిగిన బీజేపీ కార్యకర్తలు కళాశాల లోపలికి వెళ్లి కార్యాలయాలను ధ్వంసం చేశారు.
అక్కడి మోటార్ సైకిళ్లకు నిప్పు పెట్టారు. ప్రముఖ తత్వవేత్త ఈశ్వర చంద్ర విద్యాసాగర్ విగ్రహాన్ని కూడా బీజేపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. ఈ ఘటన తర్వాత కోల్‌కతాలోని పలు ఇతర ప్రాంతాల్లోనూ హింస చెలరేగింది. ఘటనపై అమిత్ షా మాట్లాడుతూ ‘నాపై దాడి చేసేందుకు టీఎంసీ గూండాలు ప్రయత్నించారు. హింసను రగిలించేందుకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రయత్నించారు. కానీ నేను సురక్షితంగా ఉన్నాను. టీఎంసీ కార్యకర్తలు దాడి చేస్తుంటే పోలీసులు మౌనంగా చూస్తూ ఉన్నారు. మా ర్యాలీ మార్గాన్ని కూడా వారు తప్పుదారి పట్టించారు’ అని ఆరోపించారు.
అమిత్ షా దేవుడా.. పెద్ద గూండా
అమిత్ షా ఆరోపణలకు మమత స్పందిస్తూ ‘ఆయనే పెద్ద గూండా. విద్యా సాగర్ మీద మీరు చెయ్యి వేశారు. ఇక మిమ్మల్ని గూండా అని కాకుండా ఇంకేమని పిలవాలి? మీ ద్ధాంతాలు, విధానాలంటే నాకు అసహ్యం’ అని అన్నారు. ఘర్షణల అనంతరం విద్యాసాగర్ కళాశాలను మమత పరిశీలించారు. అక్కడ ఆమె మాట్లాడుతూ ‘అమిత్ షా తన గురించి తాను ఏమనుకుంటున్నారు? ఆయనకు వ్యతిరేకంగా ఎవ్వరూ పోటీ చేయకుండా ఉండటానికి ఆయనేమైనా దేవుడా అని ఆమె ప్రశ్నించారు.
కోల్‌కతాలో రోడ్ షో కోసం అమిత్ షా కొందరు వ్యక్తులను బయటి రాష్ట్రాల నుంచి తీసుకొచ్చారనీ, ఈ హింసకు వారే కారణమని టీఎంసీ నేతలు ఆరోపించారు. బెంగాల్ విద్యా శాఖ మంత్రి, టీఎంసీ ప్రధాన కార్యదర్శి పార్థ చటర్జీ విద్యాసాగర్ కూడా కళాశాలను దాడి అనంతరం పరిశీలించారు. విద్యాసాగర్ విగ్రహాన్ని బీజేపీ నేతలు ధ్వంసం చేయడాన్ని ఆయన ఖండిస్తూ, బీజేపీకి బెంగాల్ సంస్కృతి అంటే గౌరవం లేదన్నారు. విచారణ ప్రారంభమైందనీ, విగ్రహాన్ని పాడుచేసిన వారిని పట్టుకుంటామని పోలీసులు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment