ప్రియాంకలో ఇందిరా గాంధీని చూసుకుంటున్నారు
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరపరాజయం చవిచూసిన అనంతరం ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని కోరుతున్న కాంగ్రెస్ నాయకుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రజలు ప్రియాంకలో దివంగత నాయకురాలు ఇందిరా గాంధీని చూసుకుంటున్నారని, ఆమె గొప్ప పోరాటయోధురాలని కేంద్ర ఆహార మంత్రి కేవీ థామస్ అన్నారు.
ప్రియాంక రాజకీయాల్లో వచ్చి తల్లి సోనియా గాంధీ, సోదరుడు రాహుల్ గాంధీలతో కలసి కాంగ్రెస్ను నడిపించాలని థామస్ కోరారు. ప్రజలను ఆకర్షించే నాయకత్వ లక్షణాలు ప్రియాంకలో సహజ సిద్ధంగా ఉన్నాయని ప్రశంసించారు. బూత్ స్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ఎన్నికలు నిర్వహించాలని థామస్ అన్నారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి పళ్లంరాజు కూడా ప్రియాంక ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని కోరారు.