వెయిటింగ్ నిల్.. వేగంగా టికెట్ | Waiting Nil , for a speeding ticket | Sakshi
Sakshi News home page

వెయిటింగ్ నిల్.. వేగంగా టికెట్

Published Wed, Jul 9 2014 2:54 AM | Last Updated on Sat, Sep 2 2017 10:00 AM

వెయిటింగ్ నిల్.. వేగంగా టికెట్

వెయిటింగ్ నిల్.. వేగంగా టికెట్

పాసింజర్ టికెట్ వ్యవస్థలో సమూల మార్పులు
 
1.   ‘నెక్స్ట్ జనరేషన్ ఈ-టికెటింగ్’గా రిజర్వేషన్ వ్యవస్థ.. నిమిషానికి 7,200 టికెట్లు
2.    నెట్ ద్వారా ప్లాట్‌ఫాం, అన్‌రిజర్వ్‌డ్ టికెట్లు.. ఒకేసారి పార్కింగ్, ప్లాట్‌ఫాం టికెట్లు
3.   ఎ1, ఎ2 స్టేషన్లు, ఎంపిక చేసిన మరికొన్ని స్టేషన్లలో వైఫై సర్వీసులు
4.   రైలొచ్చే ముందు ప్రయాణికులకు వేకప్ కాల్

 న్యూఢిల్లీ: రైల్వే టికెట్‌లు మరింత సులభంగా, వేగంగా ప్రయాణికులకు లభించేలా బుకింగ్ వ్యవస్థలో సమూల మార్పులు తేనున్నట్లు రైల్వే శాఖ మంత్రి సదానంద గౌడ చెప్పారు. మంగళవారం ఆయన పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో టికెట్ బుకింగ్ వ్యవస్థ మరింత సమర్ధంగా, వేగంగా, ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చేలా పలు ప్రతిపాదనలు చేశారు. పాసింజర్ టికెట్ రిజర్వేషన్ వ్యవస్థను నెక్ట్స్ జనరేషన్ ఈ-టికెటింగ్ వ్యవస్థగా రూపుదిద్దనున్నారు. ప్రస్తుతం నిమిషానికి 2,000 టికెట్లు ఇస్తున్నారు. దీనిని నిమిషానికి 7,200 టికెట్ల సామర్థ్యానికి పెంచనున్నారు. ఒకేసారి 1.20 లక్షల యూజర్లు ఈ-టికెటింగ్‌ను ఉపయోగించుకొనేలా అత్యాధునికంగా తీర్చిదిద్దనున్నారు. అంతేకాకుండా.. మొబైల్ ఫోన్లు, పోస్టాఫీసుల ద్వారా టికెట్లు ఇచ్చే విధానాన్ని మరింత ప్రాచుర్యంలోకి తేనున్నారు.

 ఇప్పటివరకు స్టేషన్లలోనే లభించే ప్లాట్‌ఫాం, అన్‌రిజర్వ్‌డ్ టికెట్లను ఇక మీదట ఇంటర్నెట్ ద్వారా పొందే అవకాశం కల్పించనున్నారు. అంతేకాకుండా.. ప్రయాణికుల సౌకర్యార్థం ఒకేచోట పార్కింగ్, ప్లాట్‌ఫాం కాంబో టికెట్లను కూడా జారీ చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు. ప్రయాణికుల సమయాన్ని ఆదా చేసేలా టికెట్ల జారీ యంత్రాల వద్ద దీనిని ప్రయోగాత్మకంగా ప్రవేశపెడతామన్నారు.

పేపర్‌లెస్ రైల్వే కార్యాలయాలు

ఐటీ పరిజ్ఞానంతో వచ్చే ఐదేళ్లలో రైల్వే కార్యాలయాలను పేపర్‌లెస్ ఆఫీసులుగా రూపుదిద్దనున్నట్లు గౌడ చెప్పారు. ఎ1, ఎ2 స్టేషన్లు, ఎంపిక చేసిన మరికొన్ని స్టేషన్లలో వైఫై సర్వీసులను ప్రవేశపెట్టనున్నారు. ఇవే కాకుండా.. రైళ్ల రాకపోకలను తెలుసుకొనేందుకు, రైలు బయల్దేరే సమయానికి ముందుగా ప్రయాణికులకు ఫోన్ ద్వారా వేకప్‌కాల్‌తో అప్రమత్తం చేసేందుకు, ప్రయాణంలో ప్రయాణికులు దిగవలసిన ప్రాంతం వచ్చినట్లుగా సమాచారాన్ని ఇచ్చేందుకు, స్టేషన్ల సమాచారాన్ని తెలుసుకొనేందుకు, కంప్యూటరైజ్డ్ పార్సిల్ వ్యవస్థను విస్తరించేందుకు కూడా ఐటీ పరిజ్ఞానాన్ని వినియోగించనున్నారు. స్టేషన్లలో డిజిటల్ రిజర్వేషన్ చార్ట్‌లను కూడా ఉంచేలా చర్యలు చేపట్టనున్నట్లు గౌడ చెప్పారు. పీపీపీ పద్ధతిలో అన్ని టికెట్ కౌంటర్లలో ద్వంద్వ విధానంలో చార్జీలను తెలిపే వ్యవస్థను విస్తరిస్తామనితెలిపారు. రైల్వేల ఆస్తులను మరింత సమర్థంగా నిర్వహించేందుకు వాటిని డిజిటైజేషన్ చేస్తామని చెప్పారు.

బొగ్గు రవాణా లైన్ల నిర్మాణం వేగవంతం

 విద్యుత్ కేంద్రాలకు బొగ్గును త్వరగా రవాణా చేసేందుకు మూడు కీలక రైల్వే మార్గాల నిర్మాణాన్ని వేగవంతం చేస్తామని కేంద్రం తెలిపింది. తోరి-శివపూర్-కతౌతియా (జార్ఖండ్), జార్సుగూడ-బార్పల్లి, సర్దేగా(ఒడిశా), భూప్‌దేవ్‌పూర్-రాయ్‌గఢ్- మాండ్ (ఛత్తీస్‌గఢ్) లైన్ల నిర్మాణం ద్వారా రవాణా అయ్యే బొగ్గు మొత్తం 10 కోట్లటన్నులకు చేరుకుంటుందని రైల్వే మంత్రి సదానంద గౌడ బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. 7,500 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ లైన్ల నిర్మాణం ప్రస్తుతం వివిధ దశల్లో ఉంది. విద్యుత్ ప్లాంట్లు ఇంధన కొరత ఎదుర్కొంటున్న నేపథ్యంలో మంత్రి వీటి నిర్మాణంపై స్పందించారు.
 
ట్విట్టర్‌లో 40 వేల ఫాలోవర్లు!

రైల్వే మంత్రి సోమవారం ప్రారంభించిన ట్విట్టర్ ఖాతాకు నెటిజన్ల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. ట్విట్టర్‌లో రైల్వే శాఖ హ్యాండిల్(ఖాతా)  ఃఖ్చజీకజీఐఛీజ్చీకు ఒక్కరోజులోనే సుమారు 40 వేల మంది చేరువయ్యారు. ట్విట్టర్, ఫేస్‌బుక్, యూట్యూబ్‌ల ద్వారా ప్రజలకు తాజా సమాచారం అందజేస్తామని రైల్వే శాఖ తెలిపింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement