ముందుకు నడిపించేందుకు మేం సిద్ధం
యూపీని ముందుకు నడిపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, అయితే అందుకు రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో పాటు గంగా నది కృప కూడా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌లో ఆయన యూపీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. జాతీయ కార్యవర్గ సమావేశం తర్వాత బీజేపీ నిర్వహించిన అత్యంత భారీ సభ ఇది. ఈ సభతో ప్రచార పర్వానికి మోదీ శ్రీకారం చుట్టారు. ఈ ర్యాలీలో పార్టీ అగ్రనేతలు ఎల్‌కే అద్వానీ, రాజ్‌నాథ్ సింగ్, మనోహర్ పరికర్, ఉమాభారతి తదితరులు పాల్గొన్నారు.
గత రెండేళ్లలో బీజేపీ ఎన్నో విజయాలు సాధించిందని, తాను ఏ దేశం వెళ్లినా ఏదో ఒక ప్రయోజనం చేకూరుతోందని మోదీ చెప్పారు. అయితే ఆ ఘనత మోదీది కాదని.. భారతదేశానిదని ఆయన అన్నారు. ఇక గంగానది ఒక నది కాదని.. అది ఒక ఆలోచనా స్రవంతి అని చెప్పారు. ప్రపంచం మన దేశం గురించి మాట్లాడుతోందంటే అందుకు ఉత్తరప్రదేశే కారణమని తెలిపారు. అభివృద్ధి కావాలంటే వంశ పారంపర్య పాలనకు స్వస్తి పలకాలని చెప్పారు. యూపీలో ఇంతకుముందు కళ్యాణ్ సింగ్, రాజ్‌నాథ్‌సింగ్‌ల హయాంలో అద్భుతమైన అభివృద్ధి సాధ్యమైందని, అదంతా ఇప్పుడు ఏమైపోయిందని ప్రశ్నించారు.