మేరే అంగనే మే.. పాట పాడిన డింపుల్! | Dimple Yadav sings mere angane mein song for Narendra Modi | Sakshi
Sakshi News home page

మేరే అంగనే మే.. పాట పాడిన డింపుల్!

Published Thu, Feb 23 2017 6:02 PM | Last Updated on Wed, Aug 15 2018 2:30 PM

Dimple Yadav sings mere angane mein song for Narendra Modi


ఎన్నికల ప్రచార సభలలో పాటలు పెట్టడం సర్వసాధారణం. కానీ పెద్ద నాయకులు ఇలాంటి పాటలు పాడటం మాత్రం ఇంతవరకు మనం ఎక్కడా చూడలేదు. వాడి వేడిగా జరుగుతున్న ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచార సభలో తొలిసారి ఈ చిత్రం కనిపించింది. సాక్షాత్తు ముఖ్యమంత్రి భార్య, స్వయానా ఎంపీ అయిన డింపుల్ యాదవ్ (39) 'మేరే అంగనే మే.. తుమ్హారా క్యా కామ్ హై' అంటూ ఓ పాట పాడారు. అలాగని ఆమె పూర్తిగా పాడారనుకోవద్దు. ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఉద్దేశించి, తమ ఇంట్లో (అంటే యూపీలో) మీకు ఏం పని అంటూ ప్రశ్నించారు. 1980లలో అమితాబ్ హీరోగా వచ్చిన బ్లాక్‌బస్టర్ సినిమా 'లావారిస్'లోని పాట మొదటి లైనును ఇందుకోసం ఆమె ఎంచుకున్నారు. 
 
మెరూన్ రంగు చీర కట్టుకుని.. నుదుట బొట్టు పెట్టుకున్న డింపుల్ యాదవ్.. అలహాబాద్‌లో పోటీ చేస్తున్న విద్యార్థి నాయకురాలు రిచా సింగ్‌కు మద్దతుగా ప్రచారం చేస్తూ ఈ మాట అన్నారు. ఈ మాట అనగానే ఒక్కసారిగా అక్కడున్న వందలాది మంది మహిళలు 'డింపుల్ భాభీ' అంటూ నినదించారు. డింపుల్ యాదవ్ లోక్‌సభలో పెద్దగా మాట్లాడరు, ప్రశ్నలు కూడా పెద్దగా అడిగిన సందర్భాలు లేవు. ఆమె ఇప్పటివరకు రెండు సార్లు మాత్రమే చర్చలలో పాల్గొన్నారు. లోక్‌సభకు ఆమె హాజరు కూడా కేవలం 37 శాతం మాత్రమే. 2014 సంవత్సరంలో మహిళల మీద జరుగుతున్న నేరాలపై మాట్లాడుతుండగా పదే పదే ఇతర సభ్యులు అంతరాయాలు కలిగించడంతో.. కనీసం తాను మాట్లాడుతున్నందుకు తన మామగారు ములాయం సింగ్ యాదవ్ సంతోషిస్తారని చెప్పారు. 
 
అలాంటి డింపుల్.. ఇప్పుడు మాత్రం ఎన్నికల ప్రచార సభలో మంచి దూకుడుగా వెళ్తున్నారు. తన భర్త అఖిలేష్ యాదవ్‌తో కలిసి, విడిగా కూడా ప్రచారాలు చేస్తున్నారు. నేరుగా ప్రధానమంత్రి మీదే విమర్శలు చేసే స్థాయికి డింపుల్ వచ్చారు. ప్రధానమంత్రి మన్‌కీ బాత్ అంటూ రేడియోలో ప్రసంగాలు చేస్తున్నారు కానీ.. 'కామ్ కీ బాత్' (పనికొచ్చే మాటలు) లేవని అన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement