ఒంటరిగానే అధికారంలోకి వస్తాం
ఉత్తరప్రదేశ్‌లో తాము ఒంటరిగానే అధికారంలోకి వస్తామని, ఎవరి సాయం అక్కర్లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. ఆరోదశ ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో ప్రచారం కోసం వచ్చిన ఆయన మావులో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. తమతో జత కలిసిన చిన్న పార్టీలకు కేబినెట్‌లో చోటు ఇస్తామని హామీ ఇచ్చారు. ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ, బీఎస్పీ రెండు పార్టీల పని అయిపోయిందని.. ప్రజల భవిష్యత్తుతో ఆ పార్టీలు చెలగాటం ఆడాయని మండిపడ్డారు.
నెహ్రూ దేశానికి ప్రధమ ప్రధానిగా ఉన్నప్పుడు ఘాజీపూర్ ఎంపీ ఇక్కడ పేదరికం గురించి ఆయనకు చెప్పారని, దానిపై నివేదిక ఇచ్చారు గానీ ఎలాంటి చర్య తీసుకోలేదని గుర్తుచేశారు. భారతదేశం అభివృద్ధిలో కొత్త ఎత్తులు చూస్తోందని, ఇది 125 కోట్ల మంది భారతీయుల వల్లే సాధ్యమైందని అన్నారు. యూపీ కూడా అభివృద్ధి చెందాలంటే అందుకు సుస్థిరమైన బీజేపీ ప్రభుత్వం అవసరమని తెలిపారు. అమెరికా, రష్యా, ఇంగ్లండ్.. ఇలా ప్రతిచోటా భారతదేశాన్ని పొగుడుతున్నారని అన్నారు.