
సీఎంగా శశికళ ఎన్నికపై అనుమానాలు!
తమిళనాడు ముఖ్యమంత్రిగా శశికళా నటరాజన్‌ను అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఎన్నుకోవడంపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు పలు అనుమానాలు వ్యక్తం చేశారు.
న్యూఢిల్లీ: తమిళనాడు ముఖ్యమంత్రిగా శశికళా నటరాజన్‌ను అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఎన్నుకోవడంపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న శశికళ, నేడు పార్టీ నేతలతో కీలక భేటీ అనంతరం ఆమెను సీఎంగా ఎన్నుకున్నారన్న వార్తలు గుప్పుమన్నాయి. ఈ నేపథ్యంలో మురళీధర్ రావు మీడియాతో మాట్లాడారు. శశికళ ఎన్నిక విషయంలో ఎన్నో అనుమానాలున్నాయని, అన్ని అంశాలను ఇంఛార్జ్ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు పరిశీలిస్తున్నారని చెప్పారు.
తమిళనాడు అధికార పార్టీలో జరుగుతున్న ప్రస్తుత పరిణామాలతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించాలన్నది తమ అభిమతం కాదని మురళీధర్ రావు తెలిపారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం రాజీనామా విషయంలో, ఆయన తిరుగుబాటు చేయడంలో బీజేపీ పాత్ర ఉందని తీవ్ర ఆరోపణలు వెల‍్లువెత్తుతున్న సంగతి తెలిసిందే.