'నేతాజీ మంటల్లో కాలిపోవటం చూశా' | website releases eyewitness accounts of Netaji plane crash | Sakshi
Sakshi News home page

'నేతాజీ మంటల్లో కాలిపోవటం చూశా'

Published Sat, Jan 9 2016 8:51 PM | Last Updated on Sat, Oct 20 2018 7:32 PM

'నేతాజీ మంటల్లో కాలిపోవటం చూశా' - Sakshi

'నేతాజీ మంటల్లో కాలిపోవటం చూశా'

నేతాజీతో కలిసి విమానంలో ప్రయాణించిన ఆయన ముఖ్య అనుచరుడు కల్నల్ హబీబ్ ఉర్ రహమాన్ వాగ్మూలం:
'పెద్ద శబ్ధంతో ప్రొఫెల్లర్.. ఆ వెంటనే విమానం నేల కూలి మంటలు చెలరేగాయి. ముందువైపు డోర్లన్నీ బిగుసుకుపోవటంతో 'నేతాజీ.. వెనుకవైపు మార్గమొక్కటే మిగిలింది మనకు' అన్నాన్నేను. వేరే దారిలేక ఇద్దరమూ మంటల్లో నడుస్తూ బయటికొచ్చాం. నేను వేసుకున్నవి ఉన్ని దుస్తులు కావటం వల్ల తీవ్రంగా కాలిపోలేదు.

బయటికొచ్చి నేతాజీని చూద్దునుకదా.. నడుస్తున్న మంటలా ఉన్నారాయన. దుస్తులు, వెంట్రుకలు, శరీరంలో కొన్ని భాగాలు కాలిపోయాయి. నేతాజీ ఖాదీ దుస్తులు వేసుకోవటం వల్ల మంటలు త్వరగా అంటుకున్నాయని అర్థమైంది. వెంటనే నేతాజీ దగ్గరికెళ్లి ఆయన్ను కింద పడుకోబెట్టి నడుముకున్న బెల్ట్ ను విప్పే ప్రయత్నం చేశా. అప్పుడు గమనించా.. నేతాజీ తలకు ఎడమవైపు పెద్ద గాయమైంది. ఆ స్థితిలోనూ నేతాజీ.. 'నీకేం ప్రమాదం లేదు కదా, మనవాళ్లు ఎలా ఉన్నారు?' అని వాకబుచేశారు.

జపనీస్ ఎయిర్ స్టాఫ్ ఆఫీసర్ మేజర్ టారో కానో వాగ్మూలం:
'బోస్ బృందం ప్రయాణించడం కంటే రెండు రోజుల ముందే బాంబర్ విమానం ఎడమ ఇంజన్ లో లోపం ఉన్నట్లనిపించడంతో పరీక్షించా. ఆ తర్వాత అది బాగానే పనిచేస్తోదని నిర్ధారించుకున్నా. ఎందుకైనా మంచిదని ఇంజనీర్ చేతా కూడా ఓసారి పరీక్ష చేయించా. అతనుకూడా ఇంజన్ పర్ ఫెక్ట్ గా ఉందన్నాడు'

టోరెన్స్ ఎయిర్ పోర్ట్ గ్రౌండ్ ఇంజనీర్ కెప్టెన్ నకామురా అలియాస్ యమామొటో వివరణ:
'బాంబర్ విమానం ఎడమ ఇంజన్ లో లోపం ఉన్నట్లనిపించింది. అదే విషయం పైటల్(మేజర్ టకిజవా) తో చెబితే ఓ ఐదు నిమిషాలపాటు దానికి మరమ్మతులు చేశాడు. బోస్ బృందం విమానం ఎక్కకముందు రెండు సార్లు టెస్ట్ ఫ్లై కూడా చేశాడు. అంతా సిద్ధంగా ఉందనుకున్న తర్వాతే విమానం టోక్యోకు బయలుదేరింది. నేను ఎయిర్ బేస్ లో నిలబడి విమానాన్నే చూస్తున్నా..

టేకాఫ్ తీసుకుని బహుషా 100 మీటర్లు వెళ్లిందోలేదో.. విమానం ఒక్కసారిగా ఎడమవైపునకు తిరిగి, నేలరాలుతున్నట్లు అనిపించింది. విమానం గాలిలో ఉండగానే ప్రొఫెల్లర్ ఊడిపడటం చూశా. కాంక్రీట్ రన్ వేకు దూరంగా విమానం కుప్పకూలి మంటలు చెలరేగిన దృశ్యాలు కనిపించాయి. వెంటనే మేం అటువైపు పరెగుపెట్టాం'

 

షానవాజ్ ఖాన్ కమిటీ నివేది:
'ఇండియన్ నేషనల్ ఆర్మీ చీఫ్ సుభాష్ చంద్రబోస్, జపాన్ సైన్యానికి చెందిన లెప్టినెట్ జనరల్ సునామసా, సైనికులు, పైలట్, సిబ్బంది అంతా కలిపి 13 మంది ఆ రోజు ఉదయమే జపనీస్ ఎయిర్ పోర్స్ కు చెందిన బాంబర్ లోకి ప్రవేశించారు. టొరెన్స్(వియత్నాం) నుంచి హౌతో, తైపీ మీదుగా టోక్యో వెళ్లటం వారి ఉద్దేశం. అప్పుడు వాతావరణం సాధారణంగా ఉంది. విమానం ఇంజన్ లోనూ ఎలాటి లోపాలు లేవు. దీంతో హౌతోలో దిగకుండా నేరుగా తైపీకే వెళ్దామని నిర్ధారించాడు పైలట్. టోక్యోకు చేరుకోవాలనే తొందరలో బోస్, మిగతవాళ్లుకూడా అందుకు సరేనన్నారు

 

ప్రమాదం జరిగిన తర్వాత..
విమాన ప్రమాదాన్ని గుర్తించిన ఎయిర్ బేస్ సిబ్బంది ఆంబులెన్స్ లతోసహా ఘటనా స్థలికి చేరుకున్నారు. నేతాజీ సహా విమాన ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ అందర్నీ సమీపంలోని నన్మూన్ మిలటరీ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చేరేసమయానికి బోస్ ఆరోగ్యం అత్యంత విషమంగా ఉంది. ఈ సంఘటన గురించి తెలియగానే ఇండియాలోని బ్రిటిష్ అధికారులు ఇద్దరు ఇంటెలిజెన్స్ అధికారులను వియత్నాంకు పంపారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన అనంతరం ఆ ఇద్దరు ఇంటెలిజెన్స్ అధికారులు ఆసుపత్రిలో బోస్ పరిస్థితి గురించి బ్రిటిష్ పాలకులకు సమాచారం అందించారు.

 

వెలుగులోకి తెచ్చిన బ్రిటిష్ వెబ్ సైట్..

నేతాజీ మరణించినట్లుగా భావిస్తున్న రోజు (ఆగస్టు 18, 1945)న అసలేం జరిగిందనేది ప్రత్యక్ష సాక్షుల వాగ్మూలం ఆధారంగా రూపొందించిన పత్రాల్ని  బ్రిటన్ కు చెందిన బోస్ ఫైల్స్ ఇన్ఫో అనే వెబ్ సైట్ శనివారం విడుదల చేసింది. వీటిలో షాజవాజ్ ఖాన్ కమిటీ (నేతాజీ అంతర్ధానంపై 1956లో భారత్ ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ) రిపోర్టుతోపాటు మరో ముగ్గురు ప్రత్యక్ష సాక్షుల వాగ్మూలాలను వెబ్ సైట్ బయలుపర్చింది. వాగ్మూలం ఇచ్చిన వారిలో ఒకరు నేతాజీ అనుచరుడు హబీబ్ ఉర్ రహమాన్ కాగా, మిగతా ఇద్దరు ఎయిర్ స్టాఫ్ అధికారి, సహ ప్రయాణికుడు.

 

తర్వాత ఏం జరిగింది?
బోస్ ఆసుపత్రిలో కోలుకున్నారా? లేక పరమపదించారా? ఆయన్ని చూడటానికి ఇండియా నుంచి ఎవరైనా వెళ్లారా? అసలు ఆసుపత్రిలో ఏం జరిగింది? అనే ప్రశ్నలకు సమాధానాల కోసం జనవరి 16 వరకు నిరీక్షించాలి. అదే రోజున బోస్ ఫైళ్లకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడిస్తామని పేర్కొంది www.bosefiles.info వెబ్ సైట్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement