
కోల్‌కతా : ఇప్పటివరకూ గజరాజులు జనావాసంలోకి వచ్చి మనుషుల మీద దాడి చేయడం.. పంటలను నాశనం చేయడం వంటి వార్తలే చదివాము. కానీ తోటి ఏనుగుల దాడి నుంచి మనషులను కాపాడిన సంఘటన గురించి మాత్రం చాలా అరుదుగా విని ఉంటారు. ఇలాంటి సంఘటన ఒకటి పశ్చిమబెంగాల్‌లో చోటు చేసుకుంది. నాలుగేళ్ల చిన్నారిని పాదాల మధ్యన దాచి తోటి ఏనుగులు బారి నుంచి కాపాడిందో గజరాజు. గరుమారా పార్క్ సమీపంలో జరిగిన ఈ సంఘటన.
వివరాలు.. నీతు ఘోష్ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి సమీప దేవాలనయానికి వెళ్లి వస్తున్నాడు. పార్క్ మధ్యలోంచి జాతీయ రహదారి ఉండటంతో అదే సమయంలో కొన్ని ఏనుగులు ఆ రోడ్డు మీదకు వచ్చాయి. ఈ అకస్మాత్తు సంఘటనను ఊహించని ఘోష్ సడెన్ బ్రేక్ వేశాడు. దాంతో ఘోష్‌తో పాటు స్కూటర్ మీద ఉన్న అతని భార్య, నాలుగేళ్ల చిన్నారి అహనా కూడా కింద పడిపోయారు. దురదృష్టవశాత్తు అహనా వెళ్లి రోడ్డు దాటుతున్న ఏనుగుల సమీపంలో పడిపోయింది. కింద పడటంతో అప్పటికే ఘోష్‌కు గాయాలు అయ్యాయి. లేచి వెళ్లి కూతుర్ని కాపాడలనుకున్నాడు.. కానీ శరీరం అందుకు సహకరించలేదు. మరి కొద్ది సేపట్లో అహనా ఏనుగులు పాదాల కింద పడి చనిపోతుందనగా ఓ ఆశ్చర్యకమైన సంఘటన చోటు చేసుకుంది.
రోడ్డు దాటుతున్న ఓ ఏనుగు.. కిందపడ్డా అహనా దగ్గరకు వచ్చి.. తన పాదాల మధ్యన ఆ చిన్నారిని నిలిపి ఉంచింది. ఇంతలో అక్కడికి వచ్చిన ట్రక్ డ్రైవర్ ప్రమాదాన్ని గుర్తించి పెద్దగా హరన్ మోగిస్తూ ఏనుగులను భయపెట్టి అడవిలోకి వెళ్లేలా చేశాడు. దాంతో అంతసేపు ఏనుగు పాదాల మధ్య నిల్చున్న చిన్నారి అహనా తల్లి చెంతకు చేరుకుంది. అనంతరం కింద పడిన ఘోష్, అతని భార్యను ట్రక్కులో చేర్చి సమీప ఆస్పత్రికి తీసుకెళ్లాడు ట్రక్కు డ్రైవర్.