రాజీవ్‌కు మోదీకి తేడా ఏమిటీ? | what defference between rajiv gandhi and narendra modi | Sakshi
Sakshi News home page

రాజీవ్‌కు మోదీకి తేడా ఏమిటీ?

Published Tue, Nov 1 2016 4:44 PM | Last Updated on Tue, Oct 9 2018 4:36 PM

రాజీవ్‌కు మోదీకి తేడా ఏమిటీ? - Sakshi

రాజీవ్‌కు మోదీకి తేడా ఏమిటీ?

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ఆల్‌ ఇండియా రేడియో ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమంలో మాట్లాడుతూ మాజీ ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ హత్య నేపథ్యంలో 1984లో జరిగిన ఢిల్లీ అల్లర్ల గురించి ప్రస్తావించారు. ఇందిరాగాంధీ వర్ధంతిని పురస్కరించుకొని ఆనాటి విషయాలను ప్రస్తావించడం ఆయనకు సమంజసమే కావచ్చు. కానీ ఆనాటి ఢిల్లీ అల్లర్లకు, 2002లో గుజరాత్‌లో జరిగిన హిందూ, ముస్లిం అల్లర్లకు మధ్య ఎన్నో పోలికలున్న విషయాలను ఆయన మరచిపోయినట్లు ఉన్నారు.

నాడు ప్రధాన మంత్రిగా ఉన్న రాజీవ్‌ గాంధీ, గుజరాత్‌ అల్లర్లప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి నేడు ప్రధాన మంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ, ఇద్దరూ బాధ్యతా రహితంగానే వ్యవహరించారని చెప్పక తప్పదు. ఢిల్లీలో మూడు రోజులపాటు అల్లర్లు చెలరేగాక, గుజరాత్‌లో మూడు నెలలపాటు అల్లర్లు చెలరేగాయి. అదేమి చిత్రమోగానీ నవంబరు మూడవ తేదీన ఇందిరాగాంధీ అంత్యక్రియలతో కుళాయి నీళ్లు ఆపేసినట్లు ఢిల్లీ అల్లర్లు ఆగిపోయాయి. ‘ఓ మహా వృక్షం కూలినప్పుడు ప్రకంపనలు రావడం సహజమే’ అని బాధ్యతారహిత వ్యాఖ్యల ద్వారా ఢిల్లీ అల్లర్లను రాజీవ్‌ గాంధీ పరోక్షంగా ప్రోత్సహించగా, గోద్రాలో హిందువులను ఊచకోత కోసారని పదే పదే ప్రస్థావించడం ద్వారా నరేంద్ర మోదీ అల్లర్లను ప్రోత్సహించారు.

  • 1985లో జనవరి నెలలో జరిగిన పార్లమెంట్‌ సమావేశాల్లో ఇందిరాంధీకి, భోపాల్‌ గ్యాస్‌ బాధితులకు సంతాపం తెలిపిన ప్రభుత్వం ఢిల్లీ అల్లర్ల బాధితులను విస్మరించింది. మోదీ ప్రభుత్వం కూడా గుజరాత్‌ అల్లర్ల బాధితులకు సంతాపం ప్రకటించలేదు.
  • ఢిల్లీ అల్లర్లపై సుప్రీం కోర్టు సిట్టింగ్‌ జడ్జీతో దర్యాప్తు జరిపించాలంటూ ప్రతిపక్షాలు ఎన్నిసార్లు డిమాండ్‌ చేసిన రాజీవ్‌ గాంధీ ప్రభుత్వం పట్టించుకోలేదు. మాసిపోయిన గాయాలను మళ్లీ రేపినట్లు అవుతుందంటూ తప్పించుకుంటూ వచ్చారు.
  • మళ్లీ అల్లకల్లోలంగా మారుతున్న పంజాబ్‌లో శాంతియుత పరిస్థితులను స్థాపించేందుకు అకాలీ దళ్‌ చీఫ్‌ హెచ్‌ఎస్‌ లోంగోవాల్‌ను రాజీవ్‌ గాంధీ చర్చలకు ఆహ్వానించారు. అయితే ఢిల్లీ అల్లర్లపై దర్యాప్తునకు కమిషన్‌ను ఏర్పాటు చేస్తేనే వస్తానని ఆయన షరతు పెట్టారు. దాంతో తప్పనిసరై 1985, ఏప్రిల్‌ నెలలో ఢీల్ల అల్లర్లపై రంగనాథ్‌ మిశ్రా కమిషన్‌ను ఆయన ఏర్పాటు చేశారు. 1987లో ఆ కమిషన్‌ నివేదికను పార్లమెంట్‌కు సమర్పించింది. అయితే దానిపై పార్లమెంట్‌లో చర్చకు రాజీవ్‌ ప్రభుత్వం అనుమతించలేదు.
  • గుజరాత్‌ అల్లర్లపై దర్యాప్తునకు  నరేంద్ర మోదీ కూడా తప్పనిసరి పరిస్థితుల్లో నానావతి కమిషన్‌ను ఏర్పాటు చేశారు. 12 ఏళ్లపాటు సుదీర్ఘంగా దర్యాప్తు జరిపిన నానావతి కమిషన్‌ రెండేళ్ల క్రితమే తన నివేదికను గుజరాత్‌ అసెంబ్లీకి సమర్పించింది. ఇప్పటివరకు ఆ నివేదికను బహిర్గతం చేయలేదు. దానిపైనా చర్చించలేదు. ఇలాంటి నివేదికలు అసెంబ్లీకి సమర్పించాక ఆరు నెలల్లోగా చర్చించాలన్నది నియమం.
  • రెండు కమిషన్లు తేల్చిందీ ఏమీలేదని అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో ప్రతిపక్షాలు విమర్శించాయి. దేశ రాజకీయాలను కుదిపేసిన ఈ రెండు అల్లర్లలో దోషులెవరికీ శిక్ష పడలేదు.
  • పైగా ఢిల్లీ అల్లర్లలో ప్రధాన నిందితులుగా ఆరోపణలను ఎదుర్కొన్న కాంగ్రెస్‌ నాయకులు హెచ్‌కేఎల్‌ భగత్, జగదీష్‌ టైట్లర్‌లను నాడు రాజీవ్‌ గాంధీ తన కేబినెట్‌లోకి తీసుకున్నారు. గుజరాత్‌లోని నరోదయా పాటియాలో జరిగిన ముస్లింల ఊచకోతకు కారణమైన నిందితులను రెచ్చగొడుతూ మాట్లాడినట్లు కాల్‌ డేటాలో తేలిన మాయా కొద్నానీని 2007లో మోదీ తన కేబినెట్‌లోకి తీసుకున్నారు.
  • అటల్‌ బిహారి వాజపేయి అధికారంలోకి వచ్చాక నాటి ఢిల్లీ అల్లర్లపై దర్యాప్తునకు మరో కమిషన్‌ను వేశారు. ఆ కమిషన్‌ 2005లో పార్లమెంట్‌కు నివేదికను సమర్పించింది. దానిపై అప్పటి మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం పార్లమెంట్‌లో చర్చ కూడా జరిపింది. ప్రతిపక్షం డిమాండ్‌ మేరకు మన్మోహన్‌ సింగ్‌ నాటి సిక్కుల ఊచకోతకు క్షమాపణలు చెప్పారు.
  • రేడియో కార్యక్రమంలో 1984 నాటి అల్లర్లను ప్రస్తావించిన మోదీ, తన హయాంలో జరిగిన అల్లర్లపై దర్యాప్తు నివేదికను ఇప్పటికైనా చర్చకు అనుమతించాలి. నాడు రాజీవ్‌ను ఆదర్శంగా తీసుకున్న మోదీ నేడు మన్మోహన్‌ సింగ్‌ను కూడా ఆదర్శంగా తీసుకుంటే బాగుంటుంది.....................ఓ సెక్యులరిస్ట్‌ కామెంట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement