
న్యూఢిల్లీ: వాట్సాప్‌లో పొరపాటున ఎవరికైనా తప్పుడు మెసేజ్ పంపారా? ఇకపై అలాంటి వాటిని మీరు సరిదిద్దుకోవచ్చు. తప్పుగా పంపిన సందేశాలను గ్రహీతకు కనిపించకుండా డిలీట్ చేసే సదుపాయాన్ని వాట్సాప్ మంగళవారం అధికారికంగా అందుబాటులోకి తెచ్చింది. ఈ కొత్త విధానంలో మనం ఏదైనా మెసేజ్‌ను సెలక్ట్ చేసుకుని డిలీట్ బటన్ నొక్కగానే ‘డిలీట్ ఫర్ మి’, ‘డిలీట్ ఫర్ ఎవ్రీవన్’ అనే రెండు ఆప్షన్లు కనిపిస్తాయి.
మొదటి ఆప్షన్‌ను ఎంచుకుంటే సందేశం మన ఫోన్‌లో మ్రాతమే డిలీట్ అవుతుంది. రెండో ఆప్షన్‌ను ఎంచుకుంటే మెసేజ్ ఎవరికి పంపామో వారికి కూడా కనిపించకుండా పోతుంది. అయితే అవతలి వ్యక్తి ఫోన్‌లో ఆ సందేశం స్థానంలో ‘దిస్ మెసేజ్ వాజ్ డిలీటెడ్’ అని చూపిస్తుంది. అంటే మనం మెసేజ్ పంపి, ఆ తర్వాత డిలీట్ చేశామని ఆ వ్యక్తికి స్పష్టంగా తెలిసిపోతుంది. సందేశం పంపిన ఏడు నిమిషాల్లోపు మాత్రమే డిలీట్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఈ వెసులుబాటు కోసం వాట్సాప్ యాప్‌ను అప్‌డేట్ చేసుకోవాలి.