
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయం ‘తుగ్లక్ పని’ అని దానివల్ల నల్లడబ్బు వెలికి రాకపోగా, దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిందని విపక్షాలు అనవసరంగా విమర్శిస్తున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థకు లాభం లేకపోవచ్చుగానీ దేశాన్ని పాలిస్తున్న భారతీయ జనతా పార్టీకి మాత్రం బాగా లాభం చేకూరింది. 2015–16 సంవత్సరానికి బీజేపీ వద్ద 570. 86 కోట్ల రూపాయల ఆదాయం ఉండగా, పెద్ద నోట్లను రద్దు చేసిన సంవత్సరంలో, అంటే 2016–17 సంవత్సరానికి ఏకంగా ఆ ఆదాయం 1,034.27 కోట్ల రూపాయలకు పెరిగింది. ఏకంగా 81.18 శాతం పెరుగుదల నమోదయింది. కాంగ్రెస్ పార్టీ ఆదాయం అంతకుముందు సంవత్సరం కన్నా 14 శాతం తగ్గింది.
మొత్తం జాతీయ పార్టీలకు వచ్చిన ఆదాయంలో ఒక్క బీజేపీకే 66.4 శాతం ఆదాయం రాగా, కాంగ్రెస్ పార్టీకి కేవలం 14 శాతం ఆదాయం వచ్చింది. దేశంలోని రాజకీయ పార్టీలు దాఖలు చేసిన ఆదాయం పన్ను రిటర్న్‌ల ఆధారంగా ఢిల్లీలోని ‘అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిపోర్ట్ (ఏడీఆర్)’ అనే సంస్థ ఈ డేటాను సేకరించింది. కేంద్రంలో అధికారంలో ఉండడమే కాకుండా వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తూ వస్తోన్న బీజేపీకి ఇతర పార్టీలకన్నా ఎక్కువ నిధులు విరాళంగా రావడం సహజమేగానీ, ఏకంగా 81 శాతం పెరగడం అనూహ్యమని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. విరాళాలు ఇచ్చిన వారి పేర్లను వెల్లడించాల్సిన అవసరం లేదుకనుక, ఎక్కువ వరకు నల్లడబ్బే బీజేపీకి తరలి వచ్చి ఉంటుందని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
పైగా ఇదే 2016–17 సంవత్సరం కోసమే బీజేపీ ఎన్నికల కోసం ఏకంగా 606 కోట్లను ఖర్చు పెట్టింది. కాంగ్రెస్ పార్టీ 149 కోట్ల రూపాయలనే ఖర్చు పెట్టింది. బీజేపీ మొత్తం ఆదాయం 1034 కోట్ల రూపాయల్లో 997.12 కోట్ల రూపాయలు, అంటే 96 శాతం నిధులు విరాళాలు, ఆర్థిక సాయం రూపంలోనే వచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి మాత్రం 116 కోట్ల రూపాయలు కూపన్ల రూపంలో వచ్చాయి. బీజేపీకి వచ్చిన విరాళాల్లో 96 శాతం నిధులు అజ్ఞాత వ్యక్తుల నుంచే వచ్చాయి. వారి పేర్లు, ఊర్ల వివరాలు లేవు. కనీసం పాన్ నెంబర్లు లేవు. ఆదాయం పన్ను మినహాయింపుల కోసం ఎన్నికల కమిషన్‌కు బీజేపీ ఆదాయం పన్ను రిటర్నులు సమర్పిస్తున్నప్పటికీ డొనేషన్లు ఎవరిచ్చారో మాత్రం 2012 నుంచి ఇంతవరకు బీజేపీ వెల్లడించలేదు. పైగా ఈ పార్టీ విదేశాల నుంచి నల్లడబ్బును తీసుకొస్తానని, నల్ల కుబేరుల పేర్లు వెల్లడిస్తానంటూ అప్పుడప్పుడు తాటాకు చప్పుళ్లు చేస్తూ ఉంటోంది. ఒక్క రాజకీయ పార్టీలకే సమాచార హక్కు పరిధి నుంచి మినహాయింపు ఇవ్వడమంటే ప్రభుత్వాల నక్కజిత్తులను అర్థం చేసుకోవచ్చు. ఇందులో ఏ పార్టీకి మినహాయింపులేదు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం నల్లకుబేరుల నుంచి పార్టీ విరాళాలను తీసుకుంటూ ఎలా వారిని క్షమిస్తూ వచ్చిందో ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం అంతకన్నా ఎక్కువగానే నల్ల కుభేరులను కాపుకాస్తోంది.
పార్టీలకిచ్చే విరాళాల్లో మరింత పారదర్శకత్వాన్ని తీసుకొస్తానంటూ బీజేపీ ప్రభుత్వం ఎన్నికల బాండుల విధానాన్ని ప్రవేశపెట్టింది. అధికార పార్టీకి మాత్రమే ఎక్కువ విరాళాలకు ఆస్కారమిచ్చే ఈ కొత్త విధానంలో ఎన్ని చిల్లులున్నాయో సాక్షి వెబ్‌సైట్ ఇదివరకే వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment