అజర్‌కు చైనా రక్ష.. భారత్‌కు లాభం..!
అజర్‌కు చైనా రక్ష.. భారత్‌కు లాభం..!
Published Wed, Feb 8 2017 9:17 PM | Last Updated on Tue, Sep 5 2017 3:14 AM
ఆప్త మిత్రుడికి చేయందింబోయి చైనా చిక్కుల్లో పడుతోందా?. పాకిస్తాన్ టెర్రరిస్టు మసూద్ అజర్‌పై నిషేధం విధించడాన్ని చైనా మరోమారు వీటో అధికారంతో అడ్డుకోవడం భారత్‌కు కలిసొచ్చే అంశంగా మారింది. గతేడాది యూనైటెడ్ కౌన్సిల్‌లో అజర్‌పై నిషేధం విధించాలంటూ భారత్ చేసిన ప్రతిపాదనకు మోకాలు అడ్డుపెట్టిన చైనా.. తాజాగా గత నెల 19న ఒబామా సర్కారు ప్రవేశపెట్టిన ప్రతిపాదనను కూడా అడ్డుకుంది. ఈ నెల 2న జరిగిన యూనైటెడ్ కౌన్సిల్ సమావేశంలో 15 సభ్యత్వ దేశాల్లో చైనా మినహా అజర్‌పై నిషేధానికి ఏ ఒక్కరూ అడ్డు చెప్పలేదు. దీంతో మిగిలిన దేశాల ముందు చైనా దురుద్దేశం బట్టబయలైంది.
అమెరికాతో పాటు ఫ్రాన్స్, యూకేలు కూడా అజర్‌పై నిషేధ ప్రతిపాదనను కౌన్సిల్‌లో లేవనెత్తాయి. చైనా చేసిన పనికి మిగిలిన దేశాలు నోచ్చుకున్నట్లు కనిపించాయి. టెర్రరిజాన్ని పెంచి పోషించేందుకు చైనా సాయం చేస్తున్నట్లు అవి భావించే అవకాశం కనిపిస్తోంది. దీంతో కౌన్సిల్ దేశాలతో చైనాకు ఉన్న దౌత్యపరమైన సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. భారత్ అదే పనిగా అజర్‌పై నిషేధానికి కౌన్సిల్‌లో ప్రతిపాదనలు చేయడం ద్వారా చైనాను దోషిగా నిలబెట్టొచ్చు.
Advertisement
Advertisement