
భారత్‌లో మరణ శిక్షలు ఎందుకు ?
న్యూఢిల్లీ: ప్రపంచంలో మెజారిటీ దేశాలు మరణ శిక్షను రద్దు చేస్తుంటే భారత్ మాత్రం గత రెండు నెలల్లో మరణ శిక్షను విధించే రెండు కొత్త చట్టాలను తీసుకొచ్చింది. 2015 సంవత్సరం నాటికి 140 దేశాలు మరణ శిక్షను పూర్తిగా రద్దు చేశాయి. ప్రజల మరణానికి కారణమయ్యే హానికరమైన విష పదార్థాలు కలిపినట్లయితే నేరస్థులకు మరణ శిక్ష విధించాలంటూ గత మార్చి నెలలో బీహార్ ఎక్సైజ్ చట్టాన్ని తీసుకొచ్చారు. మరణ శిక్షకు వీలు కల్పించే యాంటీ హైజికింగ్ చట్టాన్ని కూడా ఈ మే నెలలో పార్లమెంట్ నోటిఫై చేసింది.
అరుదైన దారుణమైన కేసుల్లో మరణ శిక్ష విధించవచ్చనే సుప్రీం కోర్టు మార్గదర్శకాలు ఎలాగూ ఇప్పటికే అమల్లో ఉన్నాయి. గుల్బర్గ సొసైటీ లాంటి తీవ్రమైన కేసుల్లో, కిరాతకమైన రేపు కేసుల్లో మరణ శిక్షలు విధించాలనే వాదనలు ఎలాగు ఎప్పుడూ ఉంటున్నాయి. ప్రతి మనిషికి జీవించే హక్కు ఉందనే కారణంగా మరణ శిక్షను భారత్‌లో కూడా పూర్తిగా రద్దు చేయాలంటూ పలు ఎన్జీవో సంస్థలు ఆందోళన చేస్తున్న నేపథ్యంలోనే మరణ శిక్షను విధించే మరో చట్టాలను తీసుకరావడం చర్చనీయాంశం. దేశంలో మరణ శిక్షను రద్దు చేయాల్సిన సమయం ఆసన్నమైందని కూడా భారత్ లా కమిషన్ గత ఆగస్టులో సమర్పించిన నివేదికలో అభిప్రాయపడింది కూడా.
ఇటీవల తీసుకొచ్చిన రెండు చట్టాలు సుప్రీం కోర్టు సూచించిన మార్గదర్శకాలకు కూడా విరుద్ధంగా ఉన్నాయి. చంపాలనే ఉద్దేశంతోనే నేరస్థులు నేరం చేసి, పర్యవసానంగా ఎవరి చావుకైనా కారణమైన సందర్భాల్లోనే మరణ శిక్షను విధించాలని సుప్రీం కోర్టు సూచించింది. చంపాలని ఉద్దేశం లేకపోయినా, హైజాకింగ్ వల్ల, మద్యం కల్తీ వల్ల ఎవరి చావుకైనా నేరస్థులు కారణమైతే చాలు వారికి మరణ శిక్షను విధించే అధికారాన్ని పై రెండు కొత్త చట్టాలు కల్పిస్తున్నాయి.
మన దేశంలో మరణ శిక్షలు ఎక్కువే విధించినప్పటికీ అమలు చేసిందీ మాత్రం తక్కువేనని చెప్పాలి. నేషనల్ క్రైమ్ రికార్డుల బ్యూరో లెక్కల ప్రకారం 2004 నుంచి 2013 సంవత్సరం వరకు 1303 మందికి, 2014 సంవత్సరంలో 95 మందికి మరణ శిక్షలు విధించగా, గత 16 ఏళ్లలో కేవలం నలుగురకి మాత్రమే మరణ శిక్షలు అమలు చేశారు. వాటిలో 1993 నాటి ముంబై వరుస పేలుళ్ల కేసులో టైగర్ మెమన్‌కు మరణ శిక్ష అమలు చేయడమే తాజాది. మరణ శిక్షలు రద్దు దిశగా ప్రతి దేశం చర్యలు తీసుకోవాల్సిందిగా ఐక్యరాజ్య సమితి ప్రపంచ దేశాలను కోరుతున్న విషయం తెల్సిందే.