సిలిగురిపైనే సర్వత్రా ఆసక్తి
బెంగాల్ రెండో దశ ఎన్నికలకు ముగిసిన ప్రచారం
♦ 56 నియోజకవర్గాల్లో ఆదివారం పోలింగ్
♦ సిలిగురిలో మాజీ మంత్రి భట్టాచార్యతో బైచుంగ్ ఢీ
♦ సుజాపూర్‌లో మామ, మేనకోడలు హోరాహోరీ
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ రెండో దశ భాగంగా ఆదివారం 56 నియోజక వర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. శుక్రవారం సాయంత్రం ఈ నియోజకవర్గాల్లో ప్రచారం ముగిసింది. మొత్తం 383 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా అలీపుర్‌దౌర్, జల్పాయ్‌గురి, డార్జ్‌లింగ్, ఉత్తర దినాజ్‌పూర్, దక్షిణ దినాజ్‌పూర్, మాల్దా, బీర్బూమ్ జిల్లాల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మొత్తం 1.2 కోట్ల మంది ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్-లెఫ్ట్ ఫ్రంట్, బీజేపీలు అన్ని స్థానాల్లో పోటీ చేస్తుండగా, డార్జిలింగ్, జల్పాయ్‌గురి జిల్లాల్లో గూర్ఖా జనముక్తి మోర్చా పోటీలో ఉంది. ఈ రెండు జిల్లాల్లో గూర్ఖాల ఓట్లు కీలకం కానున్నాయి.
సిలిగురి, సుజాపూర్‌ల పైనే ఆసక్తి
రెండో దశలో ప్రధానంగా అందరి దృష్టి డార్జిలింగ్ జిల్లాలోని సిలిగురి నియోజకవర్గంపైనే ఉంది. గతేడాది జరిగిన సిలిగురి కార్పొరేషన్ ఎన్నికల్లో తృణమూల్‌ను లెఫ్ట్- కాంగ్రెస్ కూటమి మట్టికరిపించింది. ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకునేందుకు తృణమూల్ ఈసారి తీవ్రంగా శ్రమించింది. భారత్ ఫుట్‌బాల్ జట్టు మాజీ కెప్టెన్ బైచుంగ్ భూటియాను సిలిగురిలో మోహరించింది. భూటియా ప్రధాన ఆకర్షణగా నిలవడంతో పాటు యువ ఓటర్లను ఆకట్టుకుంటాడని ఆశలు పెట్టుకుంది. లెఫ్ట్ నుంచి సిలిగురి మేయర్, మాజీ మంత్రి అశోక్ భట్టాచార్య గట్టి పోటీనిస్తున్నారు. గత కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రతిపక్షాలన్నింటిని ఒక్క తాటిపైకి తెచ్చి తృణమూల్‌కు ఆయన షాక్‌నిచ్చారు.
సిలిగురి ఫార్ములాగా ఈ వ్యూహం పేరుపొందింది. అదే వ్యూహాన్ని అనుసరిస్తూ బెంగాల్ ఎన్నికల్లో కాంగ్రెస్- లెఫ్ట్ పార్టీలు జట్టుకట్టాయి. మాల్దాలోని సుజాపూర్‌లో కూడా ఆసక్తికర పోరు సాగుతోంది. కాంగ్రెస్ నేత ఘనీఖాన్ చౌదురి బంధువులు ఒకరిపై ఒకరు పోటీపడుతున్నారు. చౌదురీ సోదరుడు అబు నాజర్‌ఖాన్ చౌదురీ తృణమూల్ తరఫున బరిలో ఉండగా, అతని మేనకోడలు ఇషా ఖాన్ చౌదురీ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు.
ప్రచారంలో పోటాపోటీ .. అవినీతి, నారదా స్టింగ్ ఆపరేషన్, శారదా చిట్ స్కాంలతో పాటు ప్రజాస్వామ్యం గొంతు నొక్కుతున్నారంటూ ప్రచారంలో విపక్షాలు అధికార పార్టీపై విరుచుకుపడ్డాయి.
మా ఆస్తి సున్నా
రెండో దశలో ముగ్గురు అభ్యర్థులు తమకు ఒక్క రూపాయి కూడా ఆస్తి లేనట్లు చూపారు. ఏడుగురు తమకు వెయ్యి రూపాయిల కంటే తక్కువ ఆస్తి ఉందని చెప్పడం ఆసక్తి కలిగించే అంశం.