పన్నులు ఎగ్గొట్టేవారిని వదిలిపెట్టేది లేదు: మోదీ
ఇన్నాళ్లుగా దోపిడీ చేసిన సొమ్మును ఇప్పుడు తిరిగి రాబడుతున్నామని, ఇప్పటివరకు రూ. 45 వేల కోట్ల నగదు డిపాజిట్ అయిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. జపాన్‌లోని కోబె నగరంలో ప్రవాస భారతీయులతో ఆయన మాట్లాడారు. నోట్ల రద్దును స్వాగతిస్తున్నవారందరికీ సెల్యూట్ అని చెప్పారు. ఇది ఎవరినో ఇబ్బందిపెట్టడానికి తీసుకున్న నిర్ణయం కాదని, ఇబ్బందులు ఎదురైనా ప్రజలు మాత్రం సహకరిస్తున్నారని తెలిపారు. నోట్ల రద్దు అంశాన్ని చాలా రహస్యంగా ఉంచామన్నారు. పన్ను ఎగ్గొట్టేవారిని వదిలిపెట్టేది లేదని, నిజాయితీపరులను రక్షించడం మాత్రం తమ ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని అన్నారు. ఇన్నాళ్లూ గంగానదితో పుణ్యానికి ఒక్క రూపాయి కూడా వేయనివాళ్లు సైతం ఇప్పుడు వెయ్యి, 500 రూపాయల నోట్లు విసిరేస్తున్నారంటూ చమత్కరించారు.
ఇన్నాళ్లూ బ్యాంకుల ముఖం చూడనివాళ్లు కూడా ఇప్పుడు బ్యాంకులకు వెళ్తున్నారని చెప్పారు. భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతోందని, గత ఏడాది అధ్యధికంగా ఎఫ్డీఐలు వచ్చాయని మోదీ అన్నారు. గుజరాత్లో భూకంపం వచ్చినప్పుడు కోబె నగరం ఆదుకుందని, ఈ నగరంతో భారతదేశానికి చాలా కాలంగా సత్సంబంధాలు ఉన్నాయని చెప్పారు. తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ లాంటి సంస్థలు ప్రశంసిస్తున్నాయని అన్నారు. జనధన యోజన కింద పేదలందరికీ అకౌంట్లు తెరిచామని, పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయని తెలిపారు. అవినీతిని నిర్మూలించడమే అసలైన స్వచ్ఛభారత్ అని, నియమ నిబంధనలు అందరికీ సమానమేనని చెప్పారు.