
సాక్షి,చెన్నై: కేంద్రంలో బీజేపీ అధికార పగ్గాలు చేపట్టిన అనంతరం బీజేపీ చీఫ్ అమిత్ షా కుమారుడు జే షా ఆస్తులు 16,000 రెట్లు పెరిగాయనే ఆరోపణలపై ప్రధాని నరేంద్ర మోదీ తక్షణం స్పందించాలని డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ డిమాండ్ చేశారు. విపక్ష నేతలపై ఆరోపణలు వచ్చిన వెంటనే కేంద్ర ప్రభుత్వం సీబీఐ, ఈడీ, ఐటీ బృందాల దాడులతో చర్యలు చేపడుతున్న క్రమంలో బీజేపీ చీఫ్ కుమారుడిపై వచ్చిన ఆరోపణలపై మోదీ ఏం సమాధానం చెబుతారని నిలదీశారు.
తక్షణమే ఈ వ్యవహారంలో ప్రధాని మోదీ చిత్తశుద్ధితో చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రధాని జే షాపై వచ్చిన ఆరోపణలపై స్పందించి తమ నిజాయితీని నిరూపించుకోవాలని కోరారు. అవినీతిని సహించమని పదేపదే చెప్పే మోదీ ఈ వ్యవహారంలో అసలు ఏమైనా చేయగలరా అని స్టాలిన్ సందేహం వ్యక్తం చేశారు.