అన్నీ మాట్లాడుకుందాం...
భారత్ - పాకిస్తాన్‌ల నిర్ణయం
ద్వైపాక్షిక బంధంలో కీలక మలుపు
శాంతిభద్రతలు, కశ్మీర్ సహా అన్ని అంశాలపై ‘సమగ్ర ద్వైపాక్షిక చర్చలు’
♦ ఇరు దేశాల జాతీయ భద్రతా సలహాదారుల చర్చలు కొనసాగుతాయి
♦ పాక్ ప్రధాని నవాజ్‌షరీఫ్‌తో విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా భేటీ
♦ అఫ్ఘాన్ కోసం ఇస్లామాబాద్ ‘హార్ట్ ఆఫ్ ఆసియా’ సదస్సులో
♦ పాకిస్తాన్‌కు సుష్మాస్వరాజ్ స్నేహ హస్తం
ఇస్లామాబాద్: భారత్ - పాకిస్తాన్ సంబంధాల్లో ప్రతిష్టంభన తొలగింది. ఇరు దేశాల సత్సంబంధాలపై ఆశలు చిగురించాయి. సమస్యల పరిష్కారం కోసం దిశగా ఇరు దేశాలూ ముందడుగు వేశాయి. ద్వైపాక్షిక సమస్యలపై పోట్లాటలు పక్కనపెట్టి మాట్లాడుకోవాలని నిర్ణయించాయి. శాంతిభద్రతలు,కశ్మీర్ సహా అన్ని అంశాలపైనా మళ్లీ సమగ్ర చర్చలు ప్రారంభించాలని తీర్మానించాయి. ఈ చర్చలకు సంబంధించిన విధివిధానాలు, తేదీలను నిర్ణయించటానికి ఇరు దేశాల విదేశాంగ కార్యదర్శులు సమావేశమవుతారని భారత్, పాక్‌లు మంగళవారం ఇస్లామాబాద్‌లో ప్రకటించాయి. అయితే.. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక బంధాలను మెరుగుపరుచుకునేందుకు ప్రధాని మోదీ పాక్‌లో పర్యటిస్తారని పాక్ మీడియాలో వార్తలొచ్చాయి.
అయితే వీటిని భారత అధికారులు ఖండించారు. ఒకవేళ పాక్‌లో వచ్చే ఏడాది జరగబోయే సార్క్ శిఖరాగ్ర సదస్సుకు మోదీ హాజరైతే.. 12 ఏళ్ల విరామం తర్వాత భారత ప్రధాని మళ్లీ పాక్‌ను సందర్శించినట్లు అవుతుంది. 2004 జనవరిలో అప్పటి భారత ప్రధాని అటల్ బిహారీ వాజపేయి పాక్‌లో శిఖరాగ్ర సదస్సుకు హాజరై, నాటి ఆ దేశాధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్‌తో చర్చలు జరిపారు. ఆ తర్వాత ప్రధాని అయిన మన్మోహన్‌సింగ్ పాక్‌లో పర్యటించలేదు. కాగా, పది రోజుల కిందట ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో మోదీ.. పాక్ ప్రధాని షరీఫ్‌ల కలయికతో ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించి సానుకూల పరిణామాలు పునఃప్రారంభమైన విషయం తెలిసిందే. కొద్ది రోజుల కిందట ఇరు దేశాల జాతీయ భద్రతా సలహాదారులు బ్యాంకాక్‌లో సమావేశమై చర్చించటమూ విదితమే.
ఈ సానుకూల పరిణామాలకు కొనసాగింపుగా భారత విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్.. పాక్ రాజధాని ఇస్లామాబాద్‌లో ప్రారంభమైన ‘హార్ట్ ఆఫ్ ఆసియా’ సదస్సుకు హాజరయ్యారు. అఫ్ఘానిస్తాన్ కోసం బుధవారం ప్రారంభమైన సదస్సుకు హాజరైన సుష్మా.. భారత్ - పాక్‌లు పరస్పరం మాట్లాడుకోవాల్సిన సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానించారు. పాక్ ప్రధాని షరీఫ్‌తో, పాక్ ప్రధానికి విదేశీ వ్యవహారాలపై సలహాదారైన సర్తాజ్ అజీజ్‌తో చర్చలు జరిపారు. ద్వైపాక్షిక సంబంధాలపై సమగ్ర చర్చలు జరపాలని ఇరు దేశాలూ సంయుక్త ప్రకటనలో తెలిపాయి. సంయుక్త ప్రకటనలో ఇరు దేశాలూ ఉగ్రవాదాన్ని ఖండించాయి. ముంబైపై ఉగ్రవాద దాడి కేసు విచారణను సత్వరం పూర్తిచేసేలా చర్యలను వేగవంతం చేస్తున్నట్లు భారత్‌కు పాక్ హామీ ఇచ్చింది. మరోపక్క భారత్ పాక్‌ల మధ్య చర్చలు ప్రారంభం కావటం మంచి పరిణామమని ఉదారవాద హురియత్ కాన్ఫరెన్స్ నేత మీర్వాయిజ్ ఒమర్ ఫారూక్ శ్రీనగర్‌లో అన్నారు.
పాక్‌కు మా చేయి అందిస్తున్నాం...
పాక్ ప్రధానితో భేటీకి ముందు ‘హార్ట్ ఆఫ్ ఆసియా’ సదస్సులో సుష్మాస్వరాజ్ మాట్లాడుతూ.. ‘‘పాకిస్తాన్‌కు మా చేయిని అందించటానికి ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నాను. ఇరు దేశాలూ పరస్పర సంబంధాలు నెరపుకోవటానికి, ప్రాంతీయ వాణిజ్యం, సహకారాన్ని బలోపేతం చేయటానికి మనం పరిపక్వతను, ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించాల్సిన సమయం ఆసన్నమైంది. పాక్‌కు సౌకర్యవంతమైన గమనంలో సహకారంపై ముందుకు వెళ్లటానికి భారత్ సిద్ధంగా ఉంది’’ అని పేర్కొన్నారు. మరింత సమర్థవంతమైన రవాణా ఏర్పాట్ల ద్వారా అఫ్ఘానిస్తాన్‌కు సాయం చేయటానికి ఈ రోజు నిబద్ధులమవుదామని పిలుపునిచ్చారు. ఆదేశ రక్షణ సామర్థ్యాన్ని బలోపేతం చేసేందుకు అఫ్ఘాన్ ప్రభుత్వంతో కలిసి పనిచేయటానికి భారత్ సిద్ధంగా ఉందని తెలిపారు.
సుష్మా ఇస్లామాబాద్‌లో అఫ్ఘానిస్తాన్ అధ్యక్షుడు అష్రాఫ్‌ఘనీతో సమావేశమై.. రవాణా అనుసంధానం, ఆ దేశంలో ఉగ్రవాద ముప్పు, అంతర్గతంగా సమన్వయ ప్రక్రియ తదితర అంశాలపై చర్చించారు. కిర్గిజిస్తాన్, ఇరాన్ విదేశాంగ మంత్రులతోనూ ఆమె వేర్వేరుగా భేటీ అయ్యారు. అఫ్ఘానిస్తాన్ కోసం ‘హార్ట్ ఆఫ్ ఆసియా’ సదస్సు ఉగ్రవాదంపై కలసికట్టుగా పోరాడాలన్న ప్రతిజ్ఞతో ముగిసింది. పాక్ ప్రధాని షరీఫ్, అఫ్ఘాన్ అధ్యక్షుడు ఘనీలు దీనిని సంయుక్తంగా ప్రారంభించారు. పాక్ ప్రధాని నవాజ్ సదస్సును ప్రారంభించి ప్రసంగిస్తూ.. ‘ఆసియాకు అఫ్ఘాన్ గుండె వంటిది.. అఫ్ఘాన్‌లో ఎన్నికైన ప్రభుత్వానికి మేం పూర్తి మద్దతు ఇస్తున్నాం. తీవ్రవాదం, ఉగ్రవాదంపై పోరాటానికి సామూహిక విధానం అవలంబించాలి.’ అని పేర్కొన్నారు.
సమగ్ర ద్వైపాక్షిక చర్చల్లో ఏముంటాయంటే...
శాంతిభద్రతలు, జమ్మూకశ్మీర్ అంశాలతో పాటు.. పరస్పర విశ్వాస నిర్మాణ చర్యలు, సియాచిన్, సర్ క్రీక్, ఉల్లార్ బారేజ్/తుల్‌బుల్ నావిగేషన్ ప్రాజెక్ట్, ఆర్థిక-వాణిజ్య సహకారం, ఉగ్రవాదంపై పోరాటం, మాదకద్రవ్యాల నియంత్రణ, మానవీయ అంశాలు, ఆధ్యాత్మిక పర్యటన తదితర అంశాలు.
మోదీ పాక్‌కు వెళ్తారా?
జియో ఛానల్ కథనం
ఇస్లామాబాద్: ప్రధాని మోదీ వచ్చే ఏడాది చివర్లో పాక్‌లో జరిగే సార్క్ సమావేశాలకు హాజరు కానున్నారంటూ.. జియో టీవీ కథనాలు ప్రసారం చేసింది. ‘హార్ట్ ఆఫ్ ఆసియా’ సదస్సుకోసం పాక్‌లో ఉన్న సుష్మ వ్యాఖ్యలను కోట్ చేసినట్లు ఆ చానల్ తెలిపింది. అయితే భారత అధికారులు సుష్మ అలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. ఉఫాలో జరిగిన సమావేశాల సందర్భంగా సార్క్ సమావేశాలకు రావాలని షరీఫ్ ఆహ్వానించటం, దీనికి మోదీ సానుకూలంగా స్పందించారని అప్పటి ఈ సంయుక్త ప్రకటన ఆధారంగానే వార్తలు ప్రసారం చేసి ఉంటుందన్నారు.
‘‘ప్రధాని షరీఫ్‌తో పాటు సర్తాజ్‌లతో నా చర్చలు చాలా బాగా జరిగాయి. ఇంతకుముందు సమీకృత చర్చల పేరుతో, ఆ తర్వాత పునరుద్ధరించిన చర్చల పేరుతో జరుగుతున్న ద్వైపాక్షిక చర్చలను కొత్తగా పునఃప్రారంభించాలని మేం నిర్ణయించాం. ఈ చర్చలను సమగ్ర ద్వైపాక్షిక చర్చలుగా పేర్కొంటున్నాం. సమీకృత చర్చల్లోని కీలకమైన అంశాలన్నీ ఇందులో ఉంటాయి. కొన్ని అదనపు అంశాలూ ఉంటాయి. ఈ చర్చల ప్రక్రియను ఎలా ముందుకు తీసుకెళ్లాలనేదానితో పాటు.. విధివిధానాలు, ఎప్పుడు ఏ అంశాలపై చర్చించాలనే కాలక్రమం, ఆయా చర్చల్లో ఎవరు పాల్గొనాలనే అంశాలను ఇరు దేశాల విదేశాంగ కార్యదర్శుల సమావేశంలో నిర్ణయిస్తాం.’’
- షరీఫ్‌తో భేటీ తర్వాత సుష్మ