
వారు స్వచ్ఛందంగా తప్పుకోవాలి: వెంకయ్య
రాజకీయ నియామకాల్లో భాగంగా గవర్నర్లు అయిన వారందరూ వ్యవస్థ ప్రయోజనాలరీత్యా పదవుల నుంచి స్వచ్ఛందంగా తప్పుకోవాలని కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎం. వెంకయ్య నాయుడు హితవు పలికారు.
సాక్షి, బెంగళూరు: రాజకీయ నియామకాల్లో భాగంగా గవర్నర్లు అయిన వారందరూ వ్యవస్థ ప్రయోజనాలరీత్యా పదవుల నుంచి స్వచ్ఛందంగా తప్పుకోవాలని కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎం. వెంకయ్య నాయుడు హితవు పలికారు. అది వారికే హుందాగా ఉంటుందని సూచించారు. శుక్రవారం ఆయన బెంగళూరులో మెట్రో రైలు పనులను సమీక్షించాక విలేకరులతో మాట్లాడుతూ ‘గత యూపీఏ ప్రభుత్వ హయాంలో నియమితులైన గవర్నర్ల రాజీనామాకు మా ప్రభుత్వం ఒత్తిడి చేస్తోందనడం సత్యదూరం. అలా రాజీనామా చేయని వారిపై వివిధ కేసులకు సంబంధించి సీబీఐ దర్యాప్తు చేయించనున్నామని వెలువడుతున్న వార్తల్లో కూడా నిజం లేదు. ఈ విషయంలో కాంగ్రెస్ అనవసర రాద్ధాంతం చేస్తోంది’ అని వెంకయ్యనాయుడు దుయ్యబట్టారు.
మనస్సాక్షి ప్రకారం నడుచుకోవాలి: ప్రకాశ్ జవదేకర్
కొచ్చి: రాష్ట్రాల గవర్నర్ల మార్పు విషయంలో తమ ప్రభుత్వం రాజ్యాంగాన్ని అనుసరిస్తుందని కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. అయితే అదే సమయంలో గవర్నర్లు, ఇతర రాజకీయ కారణాలతో నియమితులైన వారు వారి మనస్సాక్షి ప్రకారం నడుచుకోవాలని సూచించారు.