తిరుచ్చికి చెందిన మహిళ రావడంతో చుట్టూ గుమిగూడిన అయ్యప్ప భక్తులు , శబరిమల దారిలో పత్తనంతిట్టకు చేరుకున్న మహిళా భక్తురాలు
శబరిమల/చెన్నై/పంబా: శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం వద్ద నాలుగో రోజూ ఆందోళనలు కొనసాగాయి. 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న మహిళలు ఆలయంలోకి వెళ్లవచ్చన్న సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ అయ్యప్ప భక్తులు నిరసన పెరిగింద. 50 ఏళ్లలోపు వయసున్న మహిళ ఒకరు ఆలయానికి వచ్చారన్న వదంతుల నేపథ్యంలో శనివారం పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. కుటుంబ సభ్యులతో కలిసి అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు ఇరుముడితో వచ్చిన ఓ మహిళను ఆందోళనకారులు మార్గమధ్యంలో అడ్డుకున్నారు.
దీంతో తనకు 50 సంవత్సరాలు దాటాయంటూ సదరు మహిళ ఆందోళనకారులకు నచ్చజెప్పి స్వామివారి దర్శనం కోసం కుటుంబ సభ్యులతో కలిసి ముందుకు వెళ్లింది. ఈ విషయమై పతనంతిట్ట జిల్లా కలెక్టర్ పీబీ నూహ్ మాట్లాడుతూ..‘ఓ మహిళ అయ్యప్ప స్వామి దర్శనం చేసుకునేందుకు వచ్చింది. కొన్ని వార్తా చానళ్లు ఆమెను వెంబడించాయి. దీంతో అక్కడ జనం గుంపుగా ఏర్పడ్డారు. అంతకుమించి ఏమీ జరగలేదు’ అని తెలిపారు.
50 ఏళ్లలోపు మహిళ ఒకరు ఆలయ ప్రవేశానికి వచ్చారన్న వార్తలు వదంతులేనని ఆయన స్పష్టం చేశారు. ఐదు రోజుల మాస పూజల కోసం ఈ నెల 17న శబరిమల ఆలయాన్ని తెరిచారు. మరోవైపు శుక్రవారం అయ్యప్పస్వామి ఆలయంలోకి ప్రవేశించేందుకు యత్నించిన మహిళా హక్కుల కార్యకర్త రెహానా ఫాతిమా(46) ఇంటిని ఆందోళనకారులు ధ్వంసం చేశారు. కాగా, దళిత మహిళా ఫెడరేషన్ నేత మంజు పంబా ప్రాంతంలో భారీ వర్షం కారణంగా శబరిమల దర్శనాన్ని శనివారం వాయిదా వేసుకున్నారు.
ఆందోళనకారులకు రజనీ మద్దతు..
శబరిమలలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ సూపర్‌స్టార్ రజనీకాంత్ ఆందోళనకారులకు మద్దతు పలికారు. చాల సంవత్సరాలుగా పాటిస్తున్న ఆలయ సంప్రదాయాలు, ఆచారాల్లో ఎవ్వరూ జోక్యం చేసుకోరాదని వ్యాఖ్యానించారు. అయితే సుప్రీంకోర్టు తీర్పును అగౌరపర్చడం తన ఉద్దేశం కాదని రజనీ స్పష్టం చేశారు. మతం, ఆచారాలకు సంబంధించిన విషయాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించి ఉండాల్సిందన్నారు.
దేశంలో రాజకీయ, మీడియా, సినీ రంగాలకు విస్తరిస్తున్న ‘మీ టూ’ ఉద్యమం మహిళలకు మంచిదని రజనీ అభిప్రాయపడ్డారు. అయితే దీన్ని దుర్వినియోగం చేయకూడదన్నారు. తాను స్థాపించబోయే రాజకీయ పార్టీకి సంబంధించి 90 శాతం పనులు పూర్తయ్యాయనీ, సరైన సమయంలో వివరాలను ప్రకటిస్తానని తెలిపారు. మరోవైపు ఈ వివాదంపై స్పందించేందుకు మక్కల్ నీది మయ్యం(ఎంఎన్‌ఎం) పార్టీ అధ్యక్షుడు, విలక్షణ నటుడు కమల్‌హాసన్ నిరాకరించారు.
శబరిమల వివాదంపై తన అభిప్రాయాన్ని కోరడం సరైంది కాదన్న కమల్, తాను ఎవ్వరికీ మద్దతు ఇవ్వబోనని స్పష్టం చేశారు. అయ్యప్ప ఆలయాన్ని తానెప్పుడూ సందర్శించలేదనీ, అయ్యప్ప భక్తుల ఆందోళన ఉద్దేశం ఏంటో తనకు అర్థం కాలేదని వ్యాఖ్యానించారు. అలాంటప్పుడు శబరిమల విషయంలో స్పందించడం సరైనది కాదని కమల్ అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment