
సీబీఐ కోర్టులో యడ్యూరప్ప కన్నీరు
బెంగళూరు: బీజేపీ కర్ణాటక రాష్ట్ర విభాగం చీఫ్ బి.ఎస్.యడ్డ్యూరప్ప సోమవారం సీబీఐ కోర్టులో కన్నీరు పెట్టుకున్నారు. ఆయన సీఎంగా ఉన్నపుడు జరిగిన మైనింగ్ స్కాం కేసుకు సంబంధించి కోర్టు ఆయనను పిలిపించి ప్రశ్నల వర్షం కురిపించింది. ఆయన కుటుంబం నిర్వహిస్తున్న ప్రేరణ ట్రస్ట్‌కు రూ. 20 కోట్లు నిధులు అందాయన్న ఆరోపణలపై ప్రశ్నించింది. రెండున్నర గంటల పాటు సాగిన విచారణలో యడ్డ్యూరప్పకు జడ్జి 475 ప్రశ్నలు వేశారు.
ఈ అంశంపై ఆయన ఏమైనా చెప్పాలని అనుకుంటున్నారా? అని జడ్జి ప్రశ్నించినపుడు యడ్యూరప్ప కళ్లలో నీళ్లు తిరిగాయి. ‘నేనే తప్పూ చేయలేదు. నేను ఏం చేసినా చట్టం పరిధులకు లోబడే చేశాను. ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లలేదు’ అని భావోద్వేగంతో చెప్పారు.