లక్నో: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరుకు ఆయన తండ్రి ‘రామ్‌జీ’ పేరును చేర్చాలని ఉత్తరప్రదేశ్ సర్కారు నిర్ణయించింది. ఇందుకోసం అంబేడ్కర్ పేరున్న ప్రతిచోటా (రికార్డుల్లో) రామ్‌జీ పదాన్ని చేర్చాలని ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధాన కార్యదర్శి (పరిపాలన) జితేంద్ర కుమార్ పేరుతో ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. ‘అంబేడ్కర్ తండ్రి పేరు రామ్‌జీ. మహారాష్ట్ర సంప్రదాయం ప్రకారం వ్యక్తి పేరు, ఇంటిపేరుకు మధ్య తండ్రి పేరు ఉంటుంది. అందుకే భీంరావ్ రామ్‌జీ అంబేడ్కర్ అని రికార్డుల్లో మారుస్తున్నాం’ అని సెక్రటేరియట్ ముఖ్య అధికారి ఒకరు తెలిపారు. కాగా, యోగి సర్కారు నిర్ణయాన్ని ఎస్పీ, బీఎస్పీ తీవ్రంగా విమర్శించాయి.
‘అంబేడ్కర్ పేరు మార్చటం ద్వారా లబ్ధిపొందాలని ప్రభుత్వం నీచమైన నాటకాలు ఆడుతోంది. స్వలాభం కోసం బీజేపీ.. అంబేడ్కర్ పేరును దుర్వినియోగం చేస్తోంది’ అని బీఎస్పీ చీఫ్ మాయావతి మండిపడ్డారు. ‘గాంధీ పేరును మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ అని, ప్రధాని పేరును నరేంద్ర దామోదర్‌దాస్ మోదీ అని ఎవరైనా పిలుస్తారా? అలాంటప్పుడు అంబేడ్కర్ పేరు మార్చటం ఎందుకు?’ అని మాయావతి ప్రశ్నించారు. అంబేడ్కర్ పేరు మార్చటం కన్నా.. ఆయన చూపిన బాటలో బీజేపీ ప్రభుత్వం నడిస్తే బాగుంటుందని ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ సూచించారు. కాంగ్రెస్ సహా ఇతర విపక్షాలు కూడా ప్రభుత్వం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment