
బెంగళూరు: జనతాదళ్(ఎస్) కార్యకర్త ఒకరు హత్యకు గురికావడంపై దోషులను కనికరం లేకుండా కాల్చి పారేయాలంటూ సీఎం కుమారస్వామి పోలీసులను ఆదేశించడం వివాదాస్పదమైంది. జేడీఎస్‌కు చెందిన జిల్లా నేత హొణ్నలగెరె ప్రకాశ్ సోమవారం సాయంత్రం కారులో వెళ్తుండగా బైక్‌పై వెంబడించిన ఇద్దరు వ్యక్తులు ఆయన వాహనాన్ని మద్దూర్ వద్ద అడ్డుకున్నారు. కారులో ఉన్న ప్రకాశ్‌పై దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. అనంతరం ఆయన ఆస్పత్రిలో మృతి చెందారు.
ఈ విషయం తెలిసిన సీఎం కుమారస్వామి తీవ్రంగా స్పందించారు. దోషులు కనిపిస్తే కనికరం లేకుండా కాల్చి పారేయాలంటూ పోలీసులకు ఉత్తర్వులిస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేయడంతో సీఎం వెనక్కి తగ్గారు. ఏదో కోపంలో అలా అన్నానే కానీ, ముఖ్యమంత్రిగా పోలీసు అధికారులకు ఆదేశాలివ్వలేదన్నారు. ప్రకాశ్ హత్యకు కారకులుగా అనుమానిస్తున్న ఆ ఇద్దరు వ్యక్తులు ఇంతకుముందు మరో రెండు హత్య కేసుల్లో నిందితులుగా ఉండి, బెయిల్‌పై బయటకు వచ్చారన్నారు. ఈ ఘటనకు నిరసనగా జేడీఎస్ కార్యకర్తలు రోడ్లపై బైఠాయించారు.
Comments
Please login to add a commentAdd a comment