గర్భిణిని చేతులతో మోసుకెళ్లిన మామ
ఉత్తరప్రదేశ్‌లో వైద్య ఆరోగ్య వ్యవస్థ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చెప్పడానికి ఇంతకంటే వేరే ఉదాహరణ ఏమీ అక్కర్లేదు. ఒక వ్యక్తి నిండు గర్భంతో ఉన్న తన కోడలిని ఆస్పత్రిలో ఎమర్జెన్సీ వార్డుకు తీసుకెళ్లడానికి స్ట్రెచర్ కూడా లేకపోవడంతో చేతులతో మోసుకుని ఆమెను తీసుకెళ్లాల్సి వచ్చింది! ఈ ఘటన మీర్జాపూర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఆమెకు సిజేరియన్ ఆపరేషన్ చేయగా.. అప్పటికే బిడ్డ మరణించాడు, కాసేపటికే ఆ తల్లి కూడా ప్రాణాలు కోల్పోయింది. వైద్యులు విధినిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం చూపించడం వల్లే ఇలా జరిగిందని మృతురాలి బంధువులు ఆరోపించారు. అయితే ఆస్పత్రి వర్గాలు మాత్రం.. ఆమెకు తాము అన్నిరకాలుగా మెరుగైన చికిత్సే చేశామంటున్నాయి.
లాల్‌గంజ్ తాలూకా గెరురా గ్రామానికి చెందిన అన్షు పాండే (25)ను ఈనెల నాలుగోతేదీ రాత్రి అంబులెన్సులో మీర్జాపూర్ జిల్లా కేంద్ర ఆస్పత్రికి తీసుకొచ్చారు. అయితే, దాదాపు ఐదు గంటల పాటు ఎమర్జెన్సీ వార్డులో ఒక్క డాక్టర్ కూడా లేరని ఆమె మామ కపూర్‌చంద్ పాండే ఆరోపించారు. ఆమె బాగా నొప్పులు పడుతుండటంతో మర్నాటి ఉదయం ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ వాళ్లు మళ్లీ ప్రభుత్వాస్పత్రికే తీసుకెళ్లాలని సూచించారు. తిరిగి వచ్చినప్పుడు ఎమర్జెన్సీ వార్డుకు తీసుకెళ్లేందుకు స్ట్రెచర్ కూడా అందుబాటులో లేకపోవడంతో ఆయన తన కోడలిని చేతుల మీద ఎత్తుకుని తీసుకెళ్లారు. తర్వాత కూడా చాలా సేపటివరకు వైద్యులు ఆమెను చూడలేదని ఆయన ఆరోపించారు. వృద్ధుడు తన కోడలిని చేతుల మీదుగా మోసుకుని తీసుకెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.