
దొడ్డబళ్లాపురం: సెల్ఫీ పిచ్చిలో ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు ఎన్ని జరిగినా ఎవరిలో మార్పు రావడం లేదు. ప్రకృతి అందాలు తిలకించేందుకు వచ్చి సెల్ఫీ తీసుకుంటున్న ఓ యువకుడు నీటి గుంతలో మృతిచెందాడు. ఈ సంఘటన బెంగళూరు సమీపంలోని చిక్కళ్లాపుర వద్దనున్న నందికొండలో చోటుచేసుకుంది.
వివరాలివి.. బెంగళూరులోని వివిధ ప్రాంతాలకు చెందిన ఏడుగురు యువకులు మూడు బైక్‌లపై బుధవారం ఉదయం నందికొండకు వచ్చారు. మధ్యాహ్నం తిరుగు ప్రయాణంలో దేవనహళ్లి తాలూకా మాళిగేనహళ్లి వద్దకు చేరుకున్నారు. అక్కడ నీటి గుంత పక్కనే ఉన్న ఎత్తైన బండరాయిని చూసి సెల్ఫీల కోసం ఆగారు. ఆరుగురు బండరాయిపై సెల్ఫీలు దిగుతుండగా బెంగళూరు లగ్గెరెకు చెందిన హర్షణ్(19) నీటి గుంతలో ఈతకొడుతూ సెల్ఫీ తీసుకోవాలనుకున్నాడు.
గుంత లోతుగా ఉండడంతో అతను నీట మునిగి ఉక్కిరిబిక్కిరై మరణించాడు. సెల్ఫీ ఆనందంలో ఉన్న మిగతా స్నేహితులు హర్షణ్‌ను గమనించలేదు. విషయం గ్రహించసరికి అతడు విగతజీవుడయ్యాడు. మృతదేహాన్ని దేవనహళ్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడికి చేరుకున్న విశ్వనాథపుర పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఇటీవల సెల్ఫీల మోజులో ప్రమాదాలకు గురై దాదాపుగా ఏడుగురు మరణించారు.