
సాక్షి, న్యూఢిల్లీ : ఆరోగ్యం క్షీణించడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డిని వైద్యులు బలవంతంగా ఆస్పత్రికి తరలించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్ సీపీ ఎంపీలు శుక్రవారం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఎంపీ మేకపాటి నిన్నటి నుంచి అస‍్వస్థతకు గురైనా ఆయన తన దీక్ష కొనసాగిస్తూనే వచ్చారు. ఇవాళ ఉదయం ఆయనకు తీవ్రమైన తలనొప్పి, హై బీపీతో బాధపడ్డారు. అంతేకాకుండా కొద్దిసేపటి క్రితం మేకపాటి వాంతులు చేసుకున్నారు. దీంతో ఏపీ భవన్ ప్రాథమిక వైద్యులు ...ఎంపీ మేకపాటికి వైద్య పరీక్షలు నిర్వహించి, ఆయనను ఆస్పత్రికి తరలించాల్సిందిగా సూచించారు. డాక్టర్ల సూచనతో ఎంపీ మేకపాటిని బలవంతంగా అంబులెన్స్‌లోకి ఎక్కించిన పోలీసులు... రాంమనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించారు.