చికాగోలో అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి హాజరైన తెలుగు మహిళలు
చికాగో: అమెరికాలోని చికాగో నగరంలో అమెరికన్ తెలుగు అసోసియేషన్(ఆటా) ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోవత్సవ సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఇండియన్ కాన్సులర్ అధికారిణి రాజేశ్వరీ చంద్రశేఖరన్ హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈవెంట్ గణేశ్ స్తోత్రంతో ప్రారంభమైంది. లింగ సమానత్వం, రాజకీయ, వ్యాపార, ఎకనామిక్ రంగాల్లో మహిళలకు సమాన అవకాశాలపై ప్రారంభ ఉపన్యాసం మెహెర్ మేడవరం చేశారు. ఆధునిక సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, మహిళా సాధికారత, అమెరికాలో భారతీయ మహిళల రాణింపు తదితర అంశాలపై రాజేశ్వరీ చంద్రశేఖరన్ ప్రసంగించారు. శ్రీకృష్ణ జువెల్లర్స్, రాఫెల్ టికెట్ ప్రైజ్ విజేతలకు గోల్డ్ కాయిన్స్ అందజేసింది. ఈ ఈవెంట్‌లో ఫ్యాషన్ షో కూడా జరిగింది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు భారతీయ సంప్రదాయ చీరలను ధరించి భారతదేశ గొప్పతనాన్ని చాటారు. సింగర్లు మాధురీ, శైలజ, షిర్లీలు బాలీవుడ్, టాలీవుడ్ పాటలు పాడి అక్కడి వారిని అలరించారు. ఈ కార్యక్రమంలో పలు రకాల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమ వ్యవహారాలను అమెరికన్ తెలుగు అసోసియేషన్(ఆటా) ట్రస్టీ మెహెర్ మేడావరం, బోయపల్లి సాయినాథ్ రెడ్డి ఆద్యంతం పర్యవేక్షించారు. అలంకరణ, ఏర్పాట్లను రమణ అబ్బారాజు, అమర్ నెట్టెం, సుచిత్రా రెడ్డి, లక్ష్మి బోయపల్లి, చలమ బండారు, వెంకట్‌తూడి, మహిపాల్ వంచ, హరి రైని, జగన్ బుక్కరాజు, నర్సింహ చిట్లలూరి, బీమి రెడ్డి, సతీష్ ఎల్లమిల్లి, భాను స్వర్గం చూశారు. ఆటా వ్యవస్థాపక సభ్యులు హనుమంత రెడ్డి నిర్వాహకులను ప్రశంసించారు.
Comments
Please login to add a commentAdd a comment