కుమారుని మృతితో దిగులుగా కూర్చున్న తల్లి అయిరూన్‌బీ (ఇన్‌సెట్) ఈసఫ్ (ఫైల్)
‘అమ్మా.. సౌదీలో చాలా డబ్బులు సంపాదించి తిరిగివస్తా. పెళ్లి చేసుకుని నిన్ను బాగా చూసుకుంటా..’ అని వెళ్లే ముందు కొడుకు చెప్పిన మాటలకు ఆ తల్లి ఎంతో మురిసిపోయింది. విదేశం వెళ్లినప్పటి నుంచి పది రోజులకోసారి ఫోన్ చేస్తూ కుమారుడు చెప్పే మాటలకు ఆ మాతృమూర్తి ఎంతో ఉప్పొంగిపోయేది. అలానే పది రోజుల క్రితం ఫోన్ వస్తే కుమారుడు ఏదో చెప్తాడని ఆశించింది. కానీ కుమారుడే లేడని తెలియడంతో కుప్పకూలిపోయింది. గుండెలవిసేలా రోదిస్తోంది.
చిత్తూరు, తంబళ్లపల్లె: సౌదీ అరేబియాలో తంబళ్లపల్లె యువకుడు మృతిచెందిన సంఘటన మంగళవారం వెలుగుచూసింది. సంవత్స రం క్రితం వెళ్లిన ఇతను అకాలమరణం చెందడంతో కుటుంబసభ్యులు గుండెల విసేలా రోదిస్తున్నారు. మృతుని కుటుం బీకుల కథనం మేరకు వివరాలు... మండలంలోని గోపిదిన్నెకు చెందిన కె.అయిరూన్‌బీది నిరుపేద కుటుంబం. కూలి పనులకు వెళ్తేనే పూట గడిచేది. ఈమె భర్త సర్దార్‌సాబ్ నాలుగేళ్ల క్రితం మృతి చెందా డు. అయిరూన్ బీ ఇద్దరు కుమారులు, కుమార్తెను పెంచి పెద్ద చేసింది. ఇద్దరికి పెళ్లిళ్లు చేసింది. చిన్న కుమారుడు కె.ఈసఫ్ (24) పదో తరగతి వరకు చదువుకున్నాడు. తల్లితోనే ఉన్నాడు. పై చదువులు కొనసాగించేందుకు ఆర్థిక స్థోమత లేకపోవడంతో కొద్ది రోజులు స్థానికంగా పనుల కెళ్లాడు. ఈ క్రమంలోనే సౌదీకి వెళ్లేందుకు నిశ్చయించుకున్నాడు. తల్లిని ఒప్పించి ఈసఫ్ సౌదీకి 18 నెలల క్రితం వెళ్లాడు. ఇందుకోసం తెలిసిన వాళ్ల దగ్గర సుమారు రూ.లక్ష అప్పు చేసినట్లు తెలిసింది. సౌదీ అరేబియాలోని ఆల్‌ఖరఫ్ పట్టణంలోని అనస్ అనే కపిల్ వద్ద తోట పనికి చేరినట్లు కొన్నాళ్లకి ఫోన్‌లో తెలిసింది.
విషాదవార్తతో కుప్పకూలిన తల్లి..
ఏమైందో తెలియదు కానీ వారం రోజుల క్రితం గుండె, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న ఈసఫ్‌ను ఆసుపత్రిలో చేర్పించినట్లు అక్కడి సేట్ల ద్వారా ఫోన్ సమాచారం అందింది. వైద్యచికిత్సలు అందిస్తున్న క్రమంలోనే ఆదివారం రాత్రి 9 గంటలకు మృతి చెందినట్లు తెలిసింది. ఈ విషాద వార్తతో తల్లి అయిరూన్‌బీ కుప్పకూలిపోయింది. మరణవార్తతో గ్రామంలో విషాదఛాయలు అలముకు న్నాయి. సౌదీ వెళ్లే ముందు కొడుకు చెప్పిన మాటలను తలచుకుని ఆ తల్లి ఏడుస్తుంటే ఓదార్చడం ఎవరి తరమూ కావడం లేదు.
మృతదేహం రప్పించాలనివేడుకోలు..
రంజాన్ నెల పండుగ తర్వాత ఆలస్యంగా మృతదేహాన్ని స్వగ్రామానికి పంపుతామని అక్కడి సేట్లు చెప్పినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. దీంతో ఈసఫ్ చివరిచూపుకైనా నోచుకుంటామో లేదో అన్న ఆందోళనతో వారు కన్నీటి పర్యంతమవుతున్నారు. భారత ప్రభుత్వం స్పందించి మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చే చర్యలు చేపట్టాలని ఆ నిరుపేద కుటుంబీకులు వేడుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment