మాఫియా ఆగడాలు.. ఇబ్బందుల్లో తెలుగు కార్మికులు | Nangi Devender Reddy fights on Malaysian mafia | Sakshi
Sakshi News home page

మాఫియా ఆగడాలు.. ఇబ్బందుల్లో తెలుగు కార్మికులు

Published Mon, Mar 26 2018 3:42 PM | Last Updated on Mon, Oct 8 2018 4:18 PM

Nangi Devender Reddy fights on Malaysian mafia - Sakshi

మలేషియాలో బాధిత కార్మికులతో నంగి దేవెందర్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌ :  బతుకుదెరువు కోసం పొట్టచేతపట్టుకొని మలేషియా వెళ్లిన కార్మికులు దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. ఓ వైపు రూ. 1500 లతో తీసుకునే విజిటింగ్ వీసాలను ఏజెంట్లు ఏకంగా లక్ష రూపాయలపైనే విక్రయిస్తుంటే, అక్కడికి వెళ్లిన తర్వాత మలేషియా మాఫియా చేతిలో చిక్కుకున్న కార్మికుల జీవితాలు అంధకారంలో మగ్గుతున్నాయి. సామాజిక కార్యకర్త శాంతి ప్రియతో కలిసి  టీపీసీసీ ఎన్‌ఆర్‌ఐ సెల్‌ రాష్ట్ర కన్వీనర్‌ నంగి దేవెందర్‌రెడ్డి మలేషియాలోని మాఫియా చేస్తున్న అరాచకాలను వెలుగులోకి తెచ్చారు. 20 మంది కార్మికులను మాఫియా చెరనుంచి విముక్తి చేసి ఇండియన్‌ ఎంబసీలో అప్పజెప్పారు. వీరిలో 10 మంది ఇండియాకు తిరిగి వచ్చేలా సహకరించారు. దాదాపు వెయ్యి మంది పైచిలుకు ఇంకా అక్కడే మాఫియా గుప్పిట్లో మగ్గిపోతున్నారని దేవెందర్‌ రెడ్డి చెప్పారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను సంప్రదించి మలేషియాలో ఉంటున్న కార్మికుల బాగోగులు తెలుసుకొని, అక్కడ మాఫియా చేతుల్లో ఇబ్బంది పడుతున్న కార్మికులకు విముక్తి కల్పించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్మికులు విజిట్ వీసాల మీద మలేషియా దేశానికి వెళ్లొద్దని సూచించారు. ఏజెంట్లు చూపించే కంపెనీ అగ్రిమెంట్‌ మీద అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చినా, అక్కడకి వెళ్లిన తర్వాత కార్మికులకు కనీసం వసతి, ఆహారం లాంటివి కూడా లేకుండా నరకయాతన అనుభవిస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇక అక్కడ మాఫియా వాళ్లు ఏది చెప్పితే అది చేసే పరిస్థితిల్లో కార్మికులు ఉన్నారని వారిని వెంటనే రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

మలేషియాలో క్షమాబిక్ష పథకం జూన్‌ 30 వరకు
ఏజెంట్ల చేతిలో మోసపోయి మలేషియాలో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న ఇల్లీగల్‌ కార్మికులు(స్థానిక చట్టాలను ఉల్లంగించి అక్కడే ఉంటున్న కార్మికులు) అక్కడి ప్రభుత్వం కల్పించిన ఆమ్నేస్టీ (క్షమాబిక్ష)ని వినియోగించుకోవాలని దేవెందర్‌ రెడ్డి సూచించారు. మలేషియాలోమాఫియా అరాచకాలతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటూ మిగతా రాష్ట్రాల కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. మలేషియాలోని ఇండియన్ ఎంబసీలో తెలుగు మాట్లాడేవారు లేక కార్మికులు వారి సమస్యలు చెప్పుకోలేకపోతున్నారని తెలిపారు. వెంటనే ఇండియన్‌ ఎంబసీలో తెలుగు అధికారులను నియమించి, సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ప్రభుత్వాన్ని కాంగ్రెస్‌ పార్టీ తరపున కోరారు. కాగా, గల్ఫ్‌ దేశాల్లోఉంటున్న 20 లక్షల మంది తెలుగు రాష్టాలకు చెందిన కార్మికులు కూడా ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారని, అక్కడి ఎంబసీల్లో కూడా ఇద్దరు తెలుగు అధికారులను నియమించాలని డిమాండ్ చేశారు.

గల్ఫ్ బాధిత కుటుంబాలను ఆదుకోవడానికి రూ. 500 కోట్లతో ప్రత్యేక నిధితో పాటూ, కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తామని టీఆర్‌ఎస్‌ ఎన్నికల మేనిఫేస్టోలో పెట్టిన హామీలపై మాట తప్పారని దేవెందర్‌ రెడ్డి మండిపడ్డారు. చనిపోయిన కార్మికుల కుటుంబాలకు రూ. 5లక్షల రూపాయలిస్తామని, ఉద్యోగం కోల్పోయిన వారికి ఉద్యోగం ఇస్తామని గత ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్‌ ఊదరగొట్టిందన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా 650 మంది కార్మికులు చనిపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.  ఇప్పటి వరకు ఏ ఒక్కరికి ఎక్స్‌గ్రేషియా ఇవ్వలేదని, హామీలన్ని మాటలకే పరిమితమయ్యాయని తెలంగాణ ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు.

మరో వైపు కువైట్‌లో ఆమ్నేస్టీ అవకాశం ఉన్నా, అక్కడ దుర్భర జీవితాన్ని గడుపుతున్న కార్మికులకి కనీసం విమాన టికెట్లను కూడా రాష్ట్ర ప్రభుత్వ కల్పించడం లేదని దేవెందర్‌రెడ్డి నిప్పులు చెరిగారు. కువైట్లో ఏప్రిలో 22న ఆమ్నేస్టీకి చివరి రోజు అని దీన్ని కార్మికులు వినియోగించుకోవాలని కోరారు. కాంగ్రెస్‌ తరపున ఆరుగురు సభ్యులు అక్కడికి వెళ్లి 20 మందికి టికెట్లు ఇచ్చామని పేర్కొన్నారు. ఏజెంట్ల చేతిలో మోసపోయి విదేశాల్లో కార్మికులుగా దుర్బర జీవితాన్ని గడిపి చివరికి ఏదోలా తిరిగి వస్తే, ఇక్కడ వారికి ఎలాంటి ఉపాదిలేక రోడ్డున పడుతున్నారన్నారు. ఇక్కడికి వచ్చిన బాధిత కార్మికులకు భరోసా ఎవరు కల్పిస్తారు, వారికి పునరావాసం ఇవ్వని ప్రభుత్వం ఎందుకు అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
 
కార్మికుల సహాయం కోసం సంప్రదించండి అంటూ ఇచ్చిన నెంబర్లు పని చేయడం లేదని, ఎన్‌ఆర్‌ఐ శాఖ మంత్రి కె.తారకరామారావుతో పాటూ ఎన్‌ఆర్‌ సెల్‌ డిపార్ట్‌ మెంట్‌ మొత్తం స్లీపింగ్‌ మోడ్‌లో ఉన్నాయని దేవెందర్‌ రెడ్డి నిప్పులు చెరిగారు. విహారయాత్రల్లా వీదేశీ పర్యటనలు చేస్తున్న మంత్రికి తెలంగాణ కార్మికులు సమస్యలు ఎదుర్కొంటున్న దేశాలు మాత్రం కనిపించడం లేదని ధ్వజమెత్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement