'పేపర్‌ బ్యాలెట్‌ పద్దతిలో ఎన్నికలు జరపాలి' | NRIs cunducts meet and greet with MLA Padmavathi in london | Sakshi
Sakshi News home page

'పేపర్‌ బ్యాలెట్‌ పద్దతిలో ఎన్నికలు జరపాలి'

Published Wed, Jul 25 2018 12:23 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

NRIs cunducts meet and greet with MLA Padmavathi in london - Sakshi

లండన్‌ : తెలంగాణ ఎన్నారైల ఆహ్వానం మేరకు లండన్‌లో బోనాలకు విచ్చేసిన కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డితో టీపీసీసీ ఎన్నారై సెల్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్రాల్లో నియంతృత్వ పాలన నడుస్తోందన్నారు. వచ్చే ఎన్నికల్లో కేంద్ర, రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణలో 90 సీట్లు గెలిచేలా కార్యకర్తలు పనిచేస్తున్నారని తెలిపారు. అనేక సందర్భాల్లో ఈవీఎం యంత్రాల పని తీరుపై ప్రజల్లో సందేహాలు ఉన్నాయన్నారు. అభివృద్ధి చెందిన, టెక్నాలజీలో దూసుకుపోతున్న దేశాల్లో కూడా పేపర్ బ్యాలెట్ పద్దతిలో ఎన్నికలు జరుగుతున్నాయని పద్మావతి తెలిపారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజల సందేహాలను దృష్టిలో పెట్టుకొని పేపర్ బ్యాలెట్ పద్దతిలో ఎన్నికలు నిర్వహించేలా ఎన్నారైలు కూడా చొరవ చూపాలని కోరారు.

బీజేపీ పాలనలో దేశం 100 ఏళ్లు వెనక్కి వెళ్లిందని ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ యూకే, యూరోప్ అధ్యక్షుడు కమల్ అన్నారు. సంపన్నులు సంపాదనలో 100 ఏళ్లు ముందుకు వెళ్లారన్నారు. ప్రధాని మోదీ సంపన్నులకు సేల్స్ మెన్‌గా పని చేస్తున్నారని మండిపడ్డారు. దళితులపై దాడులు అరికట్టడంలో మోదీ విఫలం అయ్యారని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నారైలను నిర్లక్ష్యం చేస్తుందని టీపీసీసీ ఎన్నారై సెల్ కన్వీనర్ గంప వేణుగోపాల్ అన్నారు. ఎన్నారై పాలసీ అమల్లోకి తీసుకువచ్చేలా మంత్రి కేఆటీర్ శ్రద్ద చూపడం లేదని అన్నారు. గల్ఫ్ కు వలస వెళ్లిన లక్షలాది రైతులు రైతు బంధు పథకం నిబంధనలతో నష్ట పోయారని పేర్కొన్నారు. 2019లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే యువత ఉపాధికి ప్రాధాన్యతనిచ్చి ప్రభుత్వ నియామకాలు చేపడుతుందని టీపీసీసీ కో కన్వీనర్ సుధాకర్ రంగుల అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు గురమిందర్ సింగ్, అస్రా అంజుమ్, రాకేష్ బిక్కుమండ్ల, మంగళారపు శ్రీధర్, బాలకృష్ణా రెడ్డి, అచ్యుత రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, శ్రీనివాస్, మధు గట్ట తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/2

2
2/2

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement