చికాగో: భారత ప్రభుత్వం చికాగోలోని భారత కాన్సులేట్ కార్యాలయం(సీజీఐ)లో ‘పాస్‌పోర్ట్ సేవా’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఈ కార్యక్రమం జరిగింది. పాస్‌పోర్ట్ దరఖాస్తులను మరింత సరళతరం చేసేందుకు భారత విదేశాంగ శాఖ ఈ కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో కాన్సులేట్ అధికారులతో పాటు పలువురు ఎన్‌ఆర్‌ఐలు పాల్గొన్నారు. పాస్‌పోర్ట్ సేవా కార్యక్రమం ద్వారా గడిచిన నాలుగున్నరేళ్లలో భారత్ పాస్‌పోర్ట్ జారీలో పెను మార్పులు వచ్చాయని విదేశాంగ శాఖ పేర్కొంది. పాస్‌పోర్ట్ సర్వీస్‌లలో 2017 సంవత్సరంలో 19 శాతం వృద్ధి సాధించామని తెలిపింది. కేవలం ఒక నెలలోనే పది లక్షల అప్లికేషన్‌లు వచ్చాయని.. పాస్‌పోర్ట్ సేవా ద్వారా ఆరు కోట్ల మందికి పాస్‌పోర్ట్‌లు జారీ చేసినట్టు వెల్లడించింది.
పాస్‌పోర్ట్ సేవలు ప్రజలకు మరింత చేరువయ్యేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నట్టు విదేశాంగ శాఖ ప్రకటించింది. పాస్‌పోర్ట్ విధానాలను సరళతరం చేయడమే కాకుండా పాస్‌పోర్ట్ సేవలను ప్రజల చెంతకే తీసుకువచ్చినట్టు స్పష్టం చేసింది. భారత్‌లోని అన్ని హెడ్ పోస్ట్ ఆఫీస్‌లలో పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు ప్రారంభించేందుకు నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. అందులో భాగంగా ఇప్పటివరకు 236 పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయని.. మరికొన్ని సేవా కేంద్రాలు కూడా త్వరలో వినియోగంలోకి రానున్నాయని తెలిపింది. దేశంలో ఉన్న పాస్‌పోర్ట్ ఆఫీసులు, గతంలో ఉన్న పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలను కలుపుకుంటే.. ప్రస్తుతం ప్రజలకు అందుబాటులో ఉన్నపాస్‌పోర్ట్ కార్యాలయాల సంఖ్య 365కు చేరిందని వెల్లడించింది.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారత రాయబార కార్యాలయాల్లో, కాన్సులేట్‌లలో పాస్‌పోర్ట్ సేవా కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపింది. అందులో భాగంగా తొలుత లండన్‌లోని భారత్ హైకమిషన్ కార్యాలయంలో ఈ ప్రోగ్రామ్‌ను పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టి.. ఆ తర్వాత బర్మింగ్‌హామ్, ఎడిన్‌బర్గ్‌లలోని భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయాల్లో దీనిని విజయవంతంగా చేపట్టినట్టు పేర్కొంది. యూఎస్ విషయానికి వస్తే.. వాషింగ్టన్ లోని భారత రాయబార కార్యాలయంలో, న్యూయార్క్, శాన్‌ఫ్రానిస్కో, అట్లాంటా, హోస్టన్‌లలోని భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయాలలో ఈ పోగ్రామ్‌ను చేపట్టినట్టు ప్రకటించింది. చికాగోలో ప్రారంభించిన పాస్‌పోర్ట్ సేవా కార్యక్రమం ద్వారా అక్కడి ఎన్‌ఆర్‌ఐలకు ఇది ఎంతగానో ఉపకరిస్తుందని తెలిపింది.
ఈ నూతన పద్దతిలో ప్రజలు సులువుగా దరఖాస్తులు సమర్పించడమే కాకుండా, డిజిటల్ పరిశీలన, భద్రతోపాటు అప్లికేషన్ ట్రాకింగ్ కూడా అందుబాటులో ఉండనున్నట్టు పేర్కొంది. రాబోయే మూడు, నాలుగు నెలల్లో అన్ని భారత రాయబార కార్యాలయాల్లో పాస్‌పోర్ట్ సేవా కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్టు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment