యూఏఈలో ఆర్థిక సంస్కరణలు | Reforms Economics in UAE | Sakshi
Sakshi News home page

యూఏఈలో ఆర్థిక సంస్కరణలు

Published Fri, Sep 6 2019 8:32 AM | Last Updated on Fri, Sep 6 2019 8:32 AM

Reforms Economics in UAE - Sakshi

ఎన్‌.చంద్రశేఖర్,మోర్తాడ్‌ (నిజామాబాద్‌ జిల్లా) :యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలను అమలు చేయడం ప్రవాస భారతీయుల పాలిట వరంగా మారింది. లైసెన్స్‌ పొంది వ్యాపారం నిర్వహించాలనుకునేవారికి యూఏఈ ప్రభుత్వం వెసులుబాటు కల్పించడంతో ఎంతో మందికి సొంతంగా కంపెనీలను ఏర్పాటు చేసుకునే అవకాశం దక్కింది. ఫలితంగా రెండు మూడేళ్ల కాలంలో తెలంగాణ జిల్లాలకు చెందిన వారి సప్లయింగ్‌ కంపెనీల సంఖ్య 500కు పైగా మించిపోయింది. ఒకప్పుడు తెలంగాణ వాసుల కంపెనీలు పదుల సంఖ్యలో ఉండగా.. ఇప్పుడు పెరిగిపోయాయి. మల్టీనేషనల్‌ కంపెనీల్లో కార్మికులుగా పనిచేసిన వారు సొంతంగా చిన్న కంపెనీలను స్థాపించే స్థాయికి ఎదగడానికి యూఏఈ ప్రభుత్వం అవకాశం కల్పించింది. టెక్నికల్‌ లైసెన్స్, క్లీనింగ్‌ లైసెన్స్‌లు పొంది సొంత కంపెనీలను నిర్వహిస్తున్నారు. యూఏఈకి వచ్చే వలస కార్మికులతో పాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్‌కు చెందిన కార్మికులకు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన కంపెనీల నిర్వాహకులు ఎక్కువ మొత్తంలో వేతనాలు చెల్లించడం విశేషం.

ప్రస్తుతం తక్కువ పెట్టుబడితోనే..
యూఏఈ ప్రభుత్వం సంస్కరణలను అమలు చేసి కంపెనీల ఏర్పాటుకు నిబంధనలను సవరించింది. దీంతో తక్కువ పెట్టుబడితోనే యూఏఈలో కంపెనీలను ఏర్పాటు చేయడానికి అవకాశం ఏర్పడింది. లైసెన్స్‌ ఫీజు, కంపెనీ కార్యాలయం, ఇమిగ్రేషన్‌ ఇతర ఖర్చులు తగ్గిపోవడంతో కొత్త కంపెనీలను ప్రారంభించడానికి అవకాశాలు విస్తృతమయ్యాయి. దీనికి తోడు కార్మికులను దిగుమతి చేసుకోవడానికి జారీచేసే వీసాలకు డిపాజిట్‌ చెల్లించే అవసరం కంపెనీల నిర్వాహకులకు తప్పింది. కేవలం రూ.10లక్షల పెట్టుబడితోనే కంపెనీ ఏర్పాటు చేయడానికి యూఏఈ సంస్కరణలు ఎంతో దోహదపడ్డాయి. ఈ కారణంగా కొత్త కంపెనీలను ఏర్పాటు చేయడానికి ఎంతో మంది ఔత్సాహికులు ముందుకు వచ్చారు. అలా రెండు, మూడేళ్లలోనే యూఏఈ పరిధిలో కార్మికులను సరఫరా చేసే కంపెనీలు అనేకం ఏర్పాటయ్యాయి. కేరళ వాసులకు దీటుగా తెలంగాణ వాసులు సప్లయింగ్‌ కంపెనీలను ఏర్పాటు చేశారు. కార్మికులను పనులు చేసే ప్రాంతానికి తీసుకెళ్లేందుకు బస్సులు, వ్యాన్లు సైతం కొనుగోలు చేయడం గమనార్హం. గతంలో నెలకు మన కరెన్సీలో రూ.50వేల వేతనం పొందిన వారు ఇప్పుడు కంపెనీలను నిర్వహిస్తూ రూ.లక్షల్లో ఆదాయం సమకూర్చుకుంటున్నారు. కన్‌స్ట్రక్షన్‌ కంపెనీలకు కార్మికులను పనిలోకి పంపించడమే కాకుండా చిన్న కాంట్రాక్టులను సైతం చేపడుతున్నారు. ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ కొందరు తమ స్వగ్రామాల్లో స్థిరాస్తులను సైతం కొనుగోలు చేస్తున్నారు. అంతేకాకుండా తమ పిల్లలను విదేశాల్లో ఉన్నత చదువులను చదివించే స్థాయికి ఎదుగుతున్నారు. గతంలో గల్ఫ్‌ దేశాల్లో పని కోసం వెళ్లిన వారు తమ పిల్లలకు తాము పనిచేసే కంపెనీలోనే ఏదో ఒక ఉద్యోగం చూసి వారికి కూడా తమ వద్దనే ఉండేలా చూసుకున్నారు.

గతంలో పెట్టుబడి ఎక్కువ..
యూఏఈ పరిధిలోని దుబాయి, అబుదాబి, షార్జా తదితర ప్రాంతాల్లో సప్లయింగ్‌ కంపెనీలను నిర్వహించడానికి ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టాల్సి వచ్చేది. కంపెనీ లైసెన్స్‌ ఫీజు, ప్రభుత్వంతో ఒప్పందం, కార్మికులకు వీసాలను జారీచేయడంపై డిపాజిట్‌ చెల్లించడం, కంపెనీ కార్యాలయం, లైసెన్స్‌ జారీకి అవకాశం ఇచ్చిన షేక్‌కు కమీషన్‌ను ఎక్కువ మొత్తంలో చెల్లించే వారు. ఒక కంపెనీ ఏర్పాటు చేయాలంటే కనీసం రూ.40లక్షల పెట్టుబడి అవసరం అయ్యేది. పెద్ద మొత్తంలో పెట్టుబడి అవసరం కావడంతో కొంత మందికి మాత్రమే కంపెనీలను ఏర్పాటు చేయడానికి అవకాశం ఏర్పడింది.

సొంత కంపెనీలు
ఏర్పాటు చేయడానికి మంచి అవకాశం యూఏఈ ప్రభుత్వం సప్లయింగ్‌ కంపెనీలను ఏర్పాటు చేయడానికి నిబంధనలు మార్చడంతో కొత్తగా సొంత కంపె నీలను ఏర్పాటు చేయడానికి నాలాంటి వారికి అవకాశం లభించింది. కొంత మంది   రెండు, మూడు కంపెనీలను కూడా నిర్వహిస్తున్నారు. స్వదేశీ, విదేశీ కార్మికులకు ఉపాధి కల్పించడానికి అవకాశం కలిగింది. సొంత కంపెనీలను నిర్వహించడం సంతోషంగా ఉంది.
– స్వామిగౌడ్, దుబాయి(వెల్లుట్ల, జగిత్యాల జిల్లా )

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement