లండన్‌లో ఘనంగా బోనాలు | TeNF conducts Bonalu in London | Sakshi
Sakshi News home page

లండన్‌లో ఘనంగా బోనాలు

Published Mon, Jul 8 2019 3:04 PM | Last Updated on Mon, Jul 8 2019 3:14 PM

TeNF conducts Bonalu in London - Sakshi

లండన్‌ : తెలంగాణ ఎన్‌ఆర్‌ఐ ఫోరం (టీఈఎన్‌ఎఫ్) ఆధ్వర్యంలో లండన్‌లోని కాన్‌ఫోర్డ్ కళాశాలలో ఘనంగా బోనాల జాతర నిర్వహించారు. ఈ సంబరాలకు బ్రిటన్ నలుమూలల నుంచి ఎన్‌ఆర్‌ఐలు తరలివచ్చారు. ఈ వేడుకలకు లండన్ ఎంపీలు వీరేంద్రశర్మ, సీమా మల్హోత్రా, భారత రాయభార కార్యాలయ ఉన్నతాధికారి కే ఈవోమ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. భారతీయ సంస్కృతి ప్రచారంలో తెలుగువారు మొదటిస్థానంలో ఉన్నారని ఎంపీ వీరేంద్రశర్మ తెలిపారు. ఎనిమిదేళ్లుగా లండన్ బోనాల వేడుకల్లో పాల్గొనడం గర్వంగా ఉందని చెప్పారు. ఇంగ్లాండ్ గడ్డపై తన నియోజకవర్గంలో బోనాలు నిర్వహించడం, హిందూ సంప్రదాయాల్లో తాను భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందని ఎంపీ సీమా మల్హోత్రా అన్నారు. ప్రపంచవ్యాప్తంగా విదేశాల్లో 2011లో తొలిసారిగా బోనాలు నిర్వహించిన తనకు సహకరించి.. ఇప్పుడు విశ్వవ్యాప్తంగా బోనాల నిర్వహణకు దోహదపడుతున్న వారందరికీ తెలంగాణ ఎన్‌ఆర్‌ఐ ఫోరం వ్యవస్థాపకుడు, చైర్మన్ గంప వేణుగోపాల్ ధన్యవాదాలు తెలిపారు.

తెలంగాణ ఆచార, సంప్రదాయాలను ప్రచారంచేయడాన్ని సేవగా సంస్థ స్వీకరిస్తోందని, నియమ నిబంధనల మేరకు కలిసివచ్చే అందరితో సంస్థ పనిచేస్తుందని టీఈఎన్‌ఎఫ్ ప్రధాన కార్యదర్శి సుధాకర్‌గౌడ్ తెలిపారు. విదేశాల్లో పుట్టిపెరిగే భారతీయ సంతతి కోసం మన పండుగలు నిర్వహించడం చాలాముఖ్యమని ఉపాధ్యక్షులు ప్రవీణ్‌రెడ్డి, రంగు వెంకట్ అన్నారు. స్థానిక లక్ష్మీనారాయణ గుడిలో కార్యదర్శి, మహిళాసభ్యుల ఆధ్వర్యంలో దుర్గామాతకు బోనం, ఒడిబియ్యం సమర్పించారు. లండన్ పురవీధుల్లో తొట్టెలు, బోనాల శోభాయాత్రను కన్నులపండువగా నిర్వహించారు. కాన్‌ఫోర్డ్ కళాశాల ఆడిటోరియంలో మీనాక్షి అంతరి అధ్యక్షతన వీరేంద్రవర్మ, శ్రీవాణి.. మహంకాళి మాతకు బోనాలు సమర్పించి పూజలు జరిపారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. భారతనాట్యం, గీతాలాపన, చిన్నారుల నృత్య ప్రదర్శన, ఆధ్యాత్మిక ప్రవచనాలు భక్తులను అలరించాయి. ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంలో మహేష్ జమ్ముల, స్వామి ఆశ, వెంకట్ ఆకుల, మహేష్ చట్ల, బాల కృష్ణ రెడ్డి, శేషు అల్ల, నరేంద్ర వర్మ, సాయి మార్గ్, మీనాక్షి అంతటి, వాణి అనసూరి, శ్రీవాణీ, సవిత, సీత, శౌరి, దివ్య, సాయి లక్ష్మి, శిరీష, అశోక్ మేడిశెట్టి, నర్సింహా రెడ్డి తిరుపరి, రాజు కొయ్యడ, రవి కూర, నరేందర్, మల్లేష్ తదితరులు ఎంతగానో కృషి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement