ఖాట్మండు : నేపాల్ దేశ రాజధాని ఖాట్మండు లో జరిగిన ఆసియా ప్రాంతీయ సదస్సుకు తెలంగాణ ఇమిగ్రెంట్స్ వెల్ఫేర్ ఫోరమ్ (తెలంగాణ ప్రవాసి సంక్షేమ వేదిక) పక్షాన డా. కలాలి త్రిలోక్ చందన్ గౌడ్ హాజరయ్యారు. 'ప్రపంచ వలసల సమగ్ర విధాన ప్రక్రియ' అనే అంశంపై ఐక్యరాజ్య సమితి రూపొందించిన తుది ముసాయిదాపై ఈనెల 21 నుండి 23 వరకు జరిగిన సమావేశాల్లో త్రిలోక్ పాల్గొన్నారు. భారతీయ వలస కార్మికులు, కార్మిక సంఘాలు, సామాజిక సంస్థల అభిప్రాయాలను డా. త్రిలోక్ మూడు రోజుల సదస్సులో వివరించారు. వలసకార్మికుల హక్కుల రక్షణ, సంక్షేమం గురించి అన్ని ప్రభుత్వాలు కృషిచేయాలని ఆయన కోరారు.
ప్రవాస భారతీయ కార్మికుల స్థితిగతుల గురించి పరిశోధన చేసిన త్రిలోక్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుండి డాక్టరేట్ పొందారు. సంగారెడ్డి జిల్లాకు చెందిన డా. త్రిలోక్ తెలంగాణ ప్రవాసి సంక్షేమ వేదిక సంస్థలో ప్రవాస భారతీయుల విభాగం కోఆర్డినేటర్ గా సేవలందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment